హైదరాబాద్, ఆంధ్రప్రభ : సాగులో సీన్ రీవర్స్ అయింది. నిన్న మొన్నటి వరకు కనీసం ఆరుతడి పంటలకు కూడా సరిపోను వర్షాలు కురవక ఇబ్బంది పడిన రైతులు ఇప్పుడు విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు వారాలుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తిచేలల్లో వరద నీరు చేరింది. చేలల్లో నీరు నిలిచింది. దీంతో పత్తి మొక్కలు రంగుమారాయి. నాలుగైదు ఆకులతో ఉన్న మొక్కలు చుట్టూ వర్షం నీరు నిలవడంతో ఆకు జాడించాయి.
ఎరుపురంగులోకి మారాయి. ఈ పరిస్థితుల్లో పత్తిపంటకు ఊహించని నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 15 రోజుల్లో కాతపట్టే దశకు వచ్చే క్రమంలో భారీ వర్షాలకు పత్తి మొక్కలు కుళ్లిపోతున్నాయని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో సాగు చేసిన పత్తికి భారీ వర్షాలతో తీవ్ర నష్టం తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
రోజూ ముసురు, లేదంటే భారీ వర్షాలతో పత్తి చేలల్లో కలుపు తీయాలన్నా, ఎరువులు వేయాలన్న వీలుకావడం లేదని, ఫలితంగా పత్తి మొక్కలు బలహీనమై ఎరుపురంగులోకి మారి ఎండిపోతున్నాయి.
సాలల్లో రోజుల తరబడి నీరు నిలుస్తుండడంతో పత్తి మొక్కల వేర్లు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు నాటిన పత్తి మొక్కలు మొలకెత్తకు పలు జిల్లాల్లో రెండుసార్లు పత్తి విత్తనాలను రైతులు విత్తారు. ఏకంగా నెలపాటు వర్షాలు కురవకపోవడంతోపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో స్ప్రెయర్లు, చేతితో మొక్క మొక్కకు నీరు పోస్తూ పత్తి మొక్కలను బతికించుకున్నారు. అప్పులు చేసి మరీ రెండుసార్లు పత్తి విత్తి, కూలీ మనుషులతో నీటిని అందిస్తే చివరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పత్తి మొక్కలు కుళ్లిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు.
కొద్దిరోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో పత్తి పంటను ఎర్రబారి, వేరుకుళ్లు తెగులు ఆశించి పెద్ద ఎత్తున మొక్కలు చచ్చిపోయాయి. లోతట్టు ప్రాంతాలు, చెరువు కింద , ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో సాగు చేసిన పత్తికి వానగండం పొంచి ఉంది. నల్లరేగడి నేలల్లో ఇప్పటికే ఎకరాకు రూ.10వేల పెట్టుబడితో రైతులు పత్తి సాగు చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ సారి పత్తి సాగు నష్టాలు మిగల్చడం ఖాయమన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవడంతో రైతులు ఆరుతడి పంట అయిన పత్తి సాగువైపు మొగ్గుచూపారు. గడిచిన రెండు సీజన్లలో పత్తికి అధిక ధర ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా పత్తి సాగు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 40లక్షల ఎకరాల్లో (77శాతం) మేరనే పత్తి సాగు అయింది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లక్షల ఎకరాల్లో పత్తి పంట వేరుకుళ్లు తెగులు బారిన పడే ప్రమాదం నెలకొంది. అధిక వర్షాలకు లక్షల ఎకరాల్లో పత్తి వేరుకుళ్లు, కాండం కుళ్లు, కాయ కుళ్లు తెగులు ఆశించే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వర్షాలు ఆగిన వెంటనే రైతులు పత్తిలోకలుపు తీయాలని, ఏ మాత్రం కలుపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. అధిక వర్షాలకు మొక్కచుట్టూ నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో మొక్క భూమినుంచి పోషకాలను గ్రహించలేదని, ఈ పరిస్థితుల్లో మొక్కకు ఆకు ద్వారా పోషకపదర్థాలను అందించేందుకు నీటిలో కరిగే ఎరువులను మొక్క పైభాగంలో పిచికారి చేయాలని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు నిలిచిన తర్వాత పేనుబంక, పచ్చదోమ ఆశించకుండా ఎస్పేట్ 1.5గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారి చేయాలని సూచిస్తున్నారు.