- ఆందోళనలో రైతులు
జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాలు, వీధులు, ఇళ్ల ముందున్న వరిపంటలు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం పడడంతో మండలంలో ఇందన్ పల్లి, కొత్తపేట, దేవునిగూడ, పొనకల్, చింతగూడ తపాల్ పూర్, రాంపూర్, తిమ్మాపూర్, రోటిగూడ, కలమడుగు, మురిమడుగు, రేండ్లగూడ, మొర్రిగూడ, ఇందనపల్లి తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన డి.ఆర్.డి.ఎ ఐకెపి, పొనకల్, చింతగూడ సింగల్ విండో సొసైటీల, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల్లోని వడ్లన్నీ నానాయి. రైతులు లబోదిబోమంటూ కొనుగోలు కేంద్రాల్లో అరవోసిన వడ్ల వద్దకు వెళ్లి తడిసిన వడ్లను ఆరబోస్తున్నారు. చేతికొచ్చిన వడ్లను అమ్ముకుందామంటే వర్షం పడి వడ్లు తడిశాయని పలువురు రైతులు కన్నీరుమున్నీరయ్యారు.
అకాల వర్షానికి మండలంలోని కొత్తపేట ,కవ్వాల, హాస్టల్ తండా, లోతొర్రె,బంగారుతండా,చింతగూడ, కలమడుగు, మురిమడుగు, ధర్మారం, ఇందనపల్లి, తదితర గ్రామాలలోని రైతుల పత్తి పంట నానింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం తమ కష్టాలను దృష్టిలో పెట్టుకొని తడిసిన వరి ధాన్యానికి, పత్తికి నష్టపరిహారం ఇవ్వాలని పలువురు రైతులు కోరారు.