తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్టాండ్ మొదలుకుని శాంతినగర్ వరకు దాదాపు పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త చెరువు పూర్తిగా నిండి సిరిసిల్ల ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. దీంతో వినాయక చవితి కోసం అమ్మకానికి సిద్ధంగా ఉంచిన విగ్రహాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
భారీ వరదతో సిరిసిల్లలో జనజీవనం స్తంభించిపోయింది. సిరిసిల్లలోని పలు కాలనీలో వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మోకాళ్ల లోతుకు పైగానే వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని కాలనీల్లో కార్లు కూడా వరద ప్రవాహనికి కొట్టుకుపోయాయి. పాతబస్టాండ్, ప్రగతి నగర్, సాయినగర్, వెంకంపేట, శాంతి నగర్, పద్మానగర్ ఏరియాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. అంబికానగర్, శాంతి నగర్, గాంధీనగర్‌లో వరద పోటెత్తింది. పెద్ద బజార్, అంబేద్కర్ నగర్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా కాలనీల వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, బోనాల చెరువు కట్ట ప్రమాదకరంగా మారడంతో ప్రజలు భయపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, శాతవాహన వర్సిటీలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు, కలెక్టరేట్‌లోకి నీరు వచ్చి చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. లోతట్టు ప్రాంతాలు మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం కంట్రోల్ రూమ్ నెంబర్ 9100069040 ఏర్పాటు చేశారు. కావున ఎలాంటి సహాయం కావలసి ఉన్న ఈ నెంబర్‌కు కాల్ చేయొచ్చు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్: 3 గంటల్లో 40 కి.మీ. సైకిల్ తొక్కిన వృద్ధుడు