Saturday, November 23, 2024

Helping Hands: భారీ వ‌ర్షం, వాగుదాట‌కుండా వ‌ర‌ద‌.. అత్య‌వ‌స‌ర సాయం చేసి ఆస్పత్రికి చేర్చిన పోలీసులు

ఆగకుండా కురుస్తున్న వానలు.. ఇంటి బయటికి వచ్చి ఎటుచూసినా నీళ్లే.. అటవీ గ్రామాలను ముంచెత్తిన వరదలు.. ఊరు దాటాలంటే పెద్ద ఎత్తున పారుతున్న వాగు దాటి పోవాల్సిందే.. అయితే.. ఆ ఊళ్లో ఒకతనికి అత్యవసర చికిత్స కావాల్సి వచ్చింది. అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే ఆ ఊరు జనం 100కి డయల్​ చేశారు. వెంటనే పోలీసులు లైన్​లోకి వచ్చారు. విషయం తెలుసుకుని ఆ అటవీ ప్రాంతానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆపద కాలంలో ఆదుకున్న ఎస్​ఐని, అక్కడి పోలీసు సిబ్బంది ఇప్పుడా గ్రామస్తులు దేవుడిలా వచ్చి ఆదుకున్నారని చేతులెత్తి మొక్కుతున్నారు.

పలిమేల, (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామానికి చెందిన షేక్ మెహబూబ్ మంగళవారం రాత్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. విషయాన్ని పలిమెల పోలీస్ స్టేషన్ కి గ్రామ‌స్తులు సమాచారం అందించారు. దీంతో బాధితుడిని మెరుగైన వైద్యం కోసం మహాదేవ్ పూర్ ఆసుపత్రికి తీసుకెళ్లాల‌ని ఎస్ఐ అరుణ్‌ని కోరారు. దీనికి స్పందించిన ఆయ‌న‌ తమ సిబ్బంది, స్థానికుల‌తో క‌లిసి పెద్దంపేట్‌ బ్రిడ్జి వద్ద బాధితున్ని దాటించారు. అంబులెన్స్ లో మహాదేవ్ పూర్ సిహెచ్ సి కి సుర‌క్షితంగా తరలించారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు అత్యవసర సహాయం అందించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement