భానుడు భగభగ మండుతున్నాడు.రోజురోజుకు భానుడి తీవ్రత ఎక్కువవుతుంది. వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎండలు దంచికొడుతుండడంతో భయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్తను అందించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో ఐదు రోజులు తీవ్ర వడగాడ్పులు ఉంటాయని తెలిపింది.
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచడంతో ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6, నల్లగొండ జిల్లా నిడమనూర్, పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.2, యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల, కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా వెల్లటూర్, కాల్వాయి, నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.1, నల్లగొండ జిల్లా మాటూర్‌లో 45, కానాయిపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది.
జిల్లాలవారీగా భద్రాద్రి కొత్తగూడెంలో 43.5, నిజామాబాద్‌లో 43.4, నల్లగొండ, ఖమ్మం, రామగుండంలో 43, మహబూబ్‌నగర్, మెదక్‌లో 42.5, ఆదిలాబాద్‌లో 42.3, హనుమకొండలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. రానున్న ఐదు రోజులు పలు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 30న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నది.
వర్ష సూచన
ఇదే సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. 28న కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అకడకడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేరొంది. 29న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది.