Saturday, November 23, 2024

Water Inflo: శ్రీశైలం జలాశయానికి భారీగా వ‌ర‌ద‌.. ఎగువన‌ వర్షాలతో పెరుగుతున్న‌ ఇన్‌ఫ్లో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణతో పాటు కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో 23,464 క్యూసెక్కుల వరదనీరు వచ్చి జలాశయంలో చేరిందని శ్రీశైలం డ్యామ్‌ అధికారులు చెప్పారు. జూరాల నుంచి శ్రీశైలంలోకి 6,300 క్యూసెక్కుల నీరు వచ్చిందని, సుంకేశుల జలాశయం నుంచి మరో 8,554 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరిందని తెలిపారు. హంద్రీ నది నుంచి శ్రీశైలం జలాశయంలోకి 8,760 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 821.10 అడుగులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొలుత ప్రవేశించడంతో జూరాల ఆపైన ఉన్న ఎగువ ప్రాంతాల్లో వర్షాలు భారీగానే కురిశాయని దీంతో వరద ప్రవాహం పెరుగుతోందని అధికారులు అంటున్నారు. వర్షాలు ఉధృతమవుతే వచ్చే నెల రోజుల్లోనే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఎగువన ఉన్న కర్నాటకలోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది.

దీంతో జూరాల, శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద వస్తుందని తద్వారా జలాశయాలు నిండి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరో 60 అడుగులపాటు నీరు చేరితే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుతుందని ఆ సమయంలో క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువ ప్రాంతం నాగార్జునసాగర్‌, పులిచింతలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement