ఇకపై కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేశారో భారీ జరిమానా విధించనున్నారు పోలీసులు. హైదరాబాద్‌లో ఐకానిక్ వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రసిద్ది పొందింది. తీగల వంతెనగా పిలిచే ఈ బ్రిడ్జిని చూసేందుకు నగర వాసులు భారీగా తరలివస్తుంటారు. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జి పైనుంచి చాలామంది ఫ్రెండ్స్‌తో కలిసి సెల్పీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీంతో హైదరాబాద్‌లో సెల్ఫీ స్పాట్‌గా కేబుల్ బ్రిడ్జి నిలిచిందని చెప్పవచ్చు.చాలామంది ఫ్యామిలీతో కలిసి వచ్చి సమయం గడుపుతూ ఉంటారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా సందర్శకులు వస్తున్నారు. దీంతో ఈ బ్రిడ్జి ఒక టూరిస్ట్ ప్రదేశంగా మారింది.
అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాల పార్కింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు. అయినా కొంతమంది బ్రిడ్జిపై కారు లేదా బైక్ పార్కింగ్ చేసి సెల్ఫీలు దిగుతున్నారు. దీని వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది. ఈ క్రమంలో బ్రిడ్జిపై బండి పార్కింగ్ చేసినవారికి పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనం పార్కింగ్ చేస్తే రూ.200 నుంచి రూ.2 వేల వరకు ఫైన్ వేస్తున్నారు. రాత్రిపూట ప్రత్యేక కెమెరాలతో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. బ్రిడ్జిపై బండి పార్కింగ్ చేసినవారికి భారీగా ఫైన్లు వేస్తున్నారు. బ్రిడ్జిపై బండి పార్కింగ్ చేయడం వల్ల వంతెన చూడటానికి వచ్చే సందర్శకులకు ఇబ్బంది కలుగుతుందని, అందుకే ట్రాఫిక్ నిబంధనలను పాటించనివారికి జరినామా విధిస్తున్నట్లు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మరి వీకెండ్ లో జరభద్రం.