Thursday, November 21, 2024

గ్రూప్‌-1కు దండిగా దరఖాస్తులు.. 3.35 లక్షలు దాటిన అప్లికేషన్​లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1కు భారీగా దరఖాస్తులు అందాయి. మంగళవారంతో దరఖాస్తు ప్రక్రియకు గడువు ముగిసింది. ఉమ్మడి ఏపీలో 2011లో వెలువడిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు 3,02,912 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు పోస్టులు కూడా తక్కువే. 312 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ వెలువడింది. కానీ ప్రస్తుతం 503 గ్రూప్‌-1 పోస్టులకుగానూ మంగళవారం రాత్రి 8 గంటల వరకు 3,35,143 దరఖాస్తులు టీఎస్‌పీఎస్‌సీకి అందాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు 3,21,704 దరఖాస్తులు వచ్చాయి.

మంగళవారం ఉదయం నుంచే గంటకు నాలుగు వేల చొప్పున దరఖాస్తులను సమర్పిస్తున్నారు. 8 గంటల వరకు ఆ సంఖ్య 3.35 లక్షలకు దాటింది. మంగళవారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉండడంతో 3.50 వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తు ప్రక్రియ గడువును వారం రోజులు పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే దీనిపై టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ను వివరణ కోరగా గడువు పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. ఓటీఆర్‌ చేసుకున్న వారు మొత్తం 5,48,177 మంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement