Tuesday, November 26, 2024

TS: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం.. ఎమ్మెల్యే గండ్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలికారని, పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు మెడిసిన్ చదవాలని, విదేశాల చదువుకు స్వస్థి పలికి జిల్లాలోనే అందుబాటులోకి తెచ్చారని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, కాలేజ్ ప్రిన్సిపాల్ రాజ్ దేవ్ డే, సూపేరెండెంట్ డా. నవీన్ తో కలిసి భూపాలపల్లిలో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కాలేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సెప్టెంబర్ 15వ తేదీన హైదరాబాద్ నుంచి వర్చువల్ గా రాష్ట్రంలో ఉన్న 09 మెడికల్ కాలేజ్ లను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభిస్తారని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా స్వరాష్ట్ర నిధులతో మెడికల్ కాలేజ్ లను నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ మెడికల్ కాలేజ్ లలో విద్యను అభ్యసించేందుకు గుజరాత్, మహారాష్ట్ర నుంచి విద్యార్థులు రావడం మన ఖ్యాతికి చిహ్నమన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కాలేజ్ లో విద్యను నేర్పేందుకు పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఈనెల 15వ తేదీన భూపాలపల్లి హనుమాన్ ఆలయం నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ర్యాలీగా వస్తారనీ తెలిపారు. ఇప్పటికే కాలేజ్ లో మెడిసిన్ చదవడానికి 100మంది విద్యార్థులకు అడ్మిషన్లు జరిగాయన్నారు. 15వ తేదీన జరిగే ఈ మహోత్తర సన్నివేశానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు అందరూ రావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement