పిల్లలు, వృద్ధులపై చలి తీవ్రత ఎక్కువ
12 డిగ్రీలుగా నమోదు అవుతున్న టెంపరేచర్ల
రాత్రివేళ ఇబ్బందిగా మారుతున్న చలిగాలులు
వారం రోజుల నుంచి పెరిగిన చలి ప్రభావం
మరో ముడు, నాలుగు రోజుల్లో మరింత డేంజర్
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు
సాధారణ జ్వరం, జలుబుబో హాస్పిటల్స్‌కి క్యూ
ఇన్ఫెక్షన్స్ సోకితే నెలలపాటు ఇబ్బందులే
చలిగాలి సోకి మూతి వంకర్లు పోయే ప్రమాదం
గమన్ మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణుల సూచనలు
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్ నందకిషోర్
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:
డెంగీ, గున్యా, మలేరియా వంటి జ్వరాలు తగ్గుముఖం పట్టాయి.. ఇక అంతా హ్యాపీగా ఉండొచ్చు అనుకునేలోపే వింటర్ సీజన్ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం దుప్పటి తీయలేని పరిస్థితి తలెత్తింది. బయటికి వెళ్లాలంటేనే వణుకుపుడుతోంది. ఇక.. ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గు బాధితులు కనిపిస్తున్నారు. కాగా, వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇంకా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రధానంగా రెండేళ్లలోపు పిల్లలు, 65ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ గచ్చిబౌలిలోని గమన్ మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణుడు నందకిషోర్ చెబుతున్నారు.
హాస్పిటల్స్‌కు పెరిగిన క్యూ..
ప్రస్తుతం ఇంటింటా దగ్గు, జలుబు, జ్వర బాధితులే ఉన్నారు. వారం, పది రోజులుగా పిల్లల్లో శ్వాసకోశ సంబంధింత సమస్యల తీవ్రత కూడా ఎక్కువగా నమోదు అవుతోంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20 శాతం నుంచి 30శాతం పెరిగిందని డాక్టర్ నందకిషోర్ చెబుతున్నారు. కాగా, ఓల్డ్ ఏజ్ పర్సన్ కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యాశాఖ కూడా అంచనా వేసింది. ఫలితంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా హాస్పిటల్స్‌కు రోగుల తాకిడి పెరిగింది. రోజుకు సగటున 42 వేల మంది అవుట్ పేషెంట్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇది సాధారణమే అయినా.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగుతుందని తెలంగాణ వైద్యశాఖ అంచనా వేస్తోంది. ఒక్క సోమవారం నాటి పరిస్థితిని ఆరా తీస్తే అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు 55,724 మంది ఔట్పేషెంట్లు వచ్చారు. వీరిలో 3,859 మంది ఎమర్జెన్సీ వార్డులో.. 3,030 మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. 41,651 మందికి డాక్టర్లు వివిధ ల్యాబ్ పరీక్షలను చేపట్టినట్టు తెలుస్తోంది.
ఇన్ఫెక్షన్ సోకితే నెలలపాటు ఇబ్బందులే..
వృద్ధులపై కూడా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ముక్కు కారడం మొదలవుతోంది. దీన్ని అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటారు. దీనివల్ల శ్వాస ఇబ్బందితో పాటు దగ్గు పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ లోపలికి చేరితే కనీసం రెండు నెలల వరకు ఇబ్బంది పడుతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు, గాలి, దుమ్ము లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సీజన్లో ఆస్తమా ఉన్నవారు చలిబారిన పడితే అది మరింత ఎక్కువవుతుందని, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా దాడి చేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చలిగాలి సోకితే మూతి వంకర పోవచ్చు..
చలికాలంలో జలుబు, దగ్గు రావడం సహజమే.. కానీ ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికే ఆరోగ్యం దెబ్బతింటే.. డాక్టర్లను సంప్రదించాలి. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, ఆస్తమా ఉన్నవారు మాత్రం మరింత జాగ్రత్త వహించాలి. ఇన్ఫెక్షన్ సోకితే ప్రమాదం పెరుగుతుంది. చలికాలంలో వృద్ధులు వాకింగ్ చేస్తుంటే మూతి వంకర పోయే ప్రమాదముంది. దీన్ని వైద్య పరిభాషలు బెల్స్పాల్సీ అంటారు. అందుకు చలిగాలి చెవుల్లోకి వెళ్లకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగటం ఉత్తమం. వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం ఎండిపోకుండా మాయిశ్చరైజర్లు, నూనెలు రాసుకోవాలి. తెల్లవారుజామునే కాకుండా, కాస్త ఎండ వచ్చాక వ్యాయామం, వాకింక్ చేయాలి..
= డాక్టర్ నందకిషోర్, గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్
==============
చిన్నారులపై చలి ప్రభావం..
చలి వాతావరణం పిల్లల్లో ఎక్కువగా ఇంపాక్ట్ కలిగిస్తుంది.. వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముంది. ముఖ్యంగా హైపోథెర్మియా (శరీరం చల్లబడటం)తో సమస్యలు పెరుగుతాయి. మొదట జలుబు సోకి, తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ లాంటివి అధికమై కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉంది. చలికాలం పిల్లల్లో ఆకలి సైతం తగ్గుతుంది. దీంతో వారు మరింత నీరసపడిపోతారు. వారి చర్మం కూడా పొడిబారుతుంది. ఒళ్లంతా దురదగా, మంటగా ఉంటుంది. పెదాలు పగిలి బాధపడుతుంటారు.
= డాక్టర్ శ్రీకాంత్, జనరల్ మెడిసిన్స్, గమన్ హాస్పిటల్స్