హైదరాబాద్ – పుట్టిన రోజు నాడైనా ఎటువంటి అరెస్ట్ లు లేకుండా పరిపాలన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హారీష్ రావు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మూసి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని ఆయన ఖండించారు. మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదని అన్నారు..
హంతకుడే సంతాప సభ పెట్టినట్లు…
ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని హరీశ్ రావు సెటైర్ వేశారు.. మూసీ మురికి కూపంగా మారడానికి మీ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా? అంటూ నిలదీశారు. పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్ పార్టీ పాపం పోదు రేవంత్ రెడ్డి? అని అన్నారు. పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, మీ పాదయాత్ర మరొక దగ్గర అంటూ ఎత్తిపోడిచారు.
హైదరాబాదులో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా? ఇదేంటని ప్రశ్నించారు. దమ్ముంటే.. హైదరాబాద్ నుండి మీ పాద యాత్ర మొదలు పెట్టండి అంటూ సవాల్ విసిరారు. మీ పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి? అని అన్నారు. మీ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరం అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. కాగా, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన మా పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.