హోటల్స్ యాజమాన్యాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ వార్నింగ్
నేడు హోటల్స్ అసోసియేషన్స్ ప్రతినిధులతో భేటి
నాణ్యత లేని ఆహారంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు డ్యామేజ్
ఆహారం కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని తెలిపారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నామన్నారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు.
కాగా, భాగ్యనగరంలో పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. నాసిరకం ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబులు ఖాళీ చేయడమే కాకుండా.. వారి ఆరోగ్యాన్ని కూడా హోటళ్ల నిర్వాహకులు నాశనం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఫ్రిజ్ లలో నిల్వ ఉంచి, కాలం చెల్లిన మాంసం, వస్తువులను వంటకు వినియోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి దామోదర్ రాజనర్సింహ హోటల్స్ ప్రతినిధులతో సమావేశమై పలు సూచనలు చేశారు.