Friday, November 22, 2024

Harithaharam – పుడమితల్లికి హరిత’హారం’ – 19.29 కోట్ల మొక్క‌లు నాట‌డ‌మే ల‌క్ష్యం ….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మొక్కలు నాటే హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదో విడత హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్‌ 19వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌లో సీఎం కేసీఆర్‌ తొమ్మిదో విడత హరిత హారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలి సిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. 33 జిల్లాలకు, 26 శాఖలకు మొక్కలు నాటే లక్ష్యాలను నిర్ధేశించారు. అటు ప్రభుత్వం ఇటు అధికారులు మొక్కలు నాటేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ వరుణుడు ప్రతిబంధకంగా మారాడు. వాస్తవానికి జూన్‌ మొదటి వారంలోనే నైరుతి పవనాలు రాష్ట్రంలో ప్రవేశించాల్సి ఉంది. కానీ జూన్‌ చివరి వారంలో రుతుపవనాలు రాష్ట్రంలో ఆలస్యంగా ప్రవేశిం చాయి. దీంతో హరితహారానికి ఆటంకాలు తప్పడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడమే ఆలస్యం మొక్కలు నాటే పండుగ ప్రారం భంకానుందని అధికారులు చెబుతున్నారు. వరుసగా వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయా జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

2023 ఏడాదికి 19.29 కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యాన్ని అటవీశాఖ నిర్దేశించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని 33 జిల్లాలకు మొక్కలు నాటే లక్ష్యాన్ని సైతం విధించింది. ఒక్కో జిల్లాకు 20 లక్షల నుంచి 6 కోట్ల వరకు మొక్కలు నాటే టార్గెట్‌ ఇచ్చారు. అదే విధంగా 2024 ఏడాదికి 20.02 కోట్ల మొక్కులు నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే 26 వివిధ ప్రభుత్వ విభాగాలకు మొక్కలు నాటే బాధ్యతలను అప్పగించారు. అయితే నర్సరీల్లో మొక్కలు సిద్ధంగానే ఉన్నా వర్షాలతో మొక్కలు నాటే కార్యక్రమానికి బ్రేక్‌ పడుతోంది. సాధారణంగా వర్షాలు ప్రారంభమైన వెంటనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వర్షాలతో భూమి మెత్తబడడం, మొక్కలు నాటేందుకు అనువుగా ఉండడంతో ఈ కార్యక్రమాన్ని చేపడతారు.

వర్షాకాలం పూర్తయ్యే సమయానికి లక్ష్యం మేరకు మొక్కలు నాటడాన్ని పూర్తిచేస్తారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు కనిపించడంలేదు. కాస్త ఆలస్యంగా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అంటున్నారు. ఈక్రమంలోనే ఇప్పటి వరకు రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తిస్థాయిలో చేపట్టలేదని చెబుతున్నారు. 2015 నుంచి 2023 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలను నాటారు. 14,864 నర్సరీలను ఏర్పాటు చేశారు. హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా రూ.10,822 కోట్లు నిధులు ఖర్చు పెట్టారు. 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2011 బృహత్‌ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రమంతటా 1,00,691 కిలోమీటర్ల మేర రహదారి వనాలు ఉన్నాయి. రాష్ట్రంలో పచ్చదనం 7.70 శాతం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. వర్షాలు పడడమే తరువాయి అన్నట్లుగా అధికారులు హరిత పండుగ జరుపుకునేందుకు ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement