Tuesday, November 26, 2024

21న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం.. విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్వాతంత్య్ర భారత్‌ వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచుకునే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు7.6 శాతం పచ్చదనం పెరిగింది. రానున్న రోజుల్లో ఆకుపచ్చదనం పెరిగి ఆకుపచ్చ తెలంగాణ శోబిల్లనుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు విడతల హరితహారం కార్యక్రమాల ద్వారా 264 కోట్ల మొక్కలను నాటారు. ఎనిమిదవ విడతలో 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈనెల 21న జరగనున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా అటవీశాఖ అధికారులు, హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి అధికారులకు పలు సూచనలతో కూడిన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణ నేలంతా పులకరించే విధంగా పల్లెలు, పట్టణాలు, సామూహిక ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీల్లో ఎక్కువ మొక్కలను నాటేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండటంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శరాష్ట్రంగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement