Friday, November 22, 2024

హరితహారం మరింత జాప్యం.. ఏర్పాట్లు పూర్తి అయినా ప్రారంభం కాలేదు!!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎనిమిదో విడత తెలంగాణకు హరితహారం ఏర్పాట్లు దాదాపు పూర్తి అయినప్పటికీ ప్రారంభం మరింత జాప్యం జరుగుతోంది. ప్రతి ఏడాది జూలై నాటికి హరితహారం కార్యక్రమం మొదలుపెట్టేవారు. ఈసారి హరితహారం ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదు. రెండు మూడుసార్లు భారీ వర్షాలు పడిన తర్వాత హరితహారం కార్యక్రమం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గత నెలలో జరిగిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయా జిల్లాల్లో అధికారులు మొక్కలను నాటి ఎనిమిదో విడత హరితహారం ప్రారంభమైనట్లుగా పేర్కొంటున్నారు. ఈ ఏడాదిఎనిమిదో విడత హరితహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించనున్నారు. ఆ ప్రాంతాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. దీంతో అటవీ విస్తీర్ణం పది శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు.

అన్ని జిల్లాల్లో పచ్చదనం విస్తరించే ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నర్సరీలను ఏర్పాటు చేసింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, అటవీ, పురపాలక శాఖలు, జిహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో 14,695 నర్సీలలో పెద్ద మొక్కలను సిద్ధం చేశారు. మొత్తం 32.99 కోట్ల మొక్కలు ఈ నర్సరీలలో అందుబాటులో ఉన్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 12,769 నర్సరీలను ఏర్పాటు చేసి 21.16 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 550 నర్సరీలలో 6.27 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 1002 నర్సరీలలో 2.03 కోట్ల మొక్కలు, హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలోని 44 నర్సరీలలో 4.26 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలోని 600 నర్సరీలలో 1.25 కోట్ల మొక్కలను అధికారులు సిద్ధం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement