Wednesday, September 18, 2024

Dogs Bite – వీధి కుక్క‌ల నుంచి కాపాడండి … రేవంత్ ప్ర‌భుత్వానికి హ‌రీశ్ రావు మొర‌


హైద‌రాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వీధి కుక్క‌ల దాడుల‌పై ప‌లుమార్లు హైకోర్టు హెచ్చ‌రించినా కాంగ్రెస్ స‌ర్కార్ మొద్దు నిద్ర వీడ‌ట్లేద‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజిఎం ఆస్ప‌త్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. వంటి హృదయవిధారక ఘటనలు జరగటాన్ని చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

ఎనిమిది నెల‌ల్లో 343 కుక్క కాటు ఘ‌ట‌న‌లు

కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గడిచిన ఎనిమిది నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావ‌ని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు హ‌రీశ్ రావు. రాష్ట్రంలో 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలిపింద‌ని అయితే . కానీ వీటి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

ప‌డ‌కేసిన పారిశుద్యం…

గ్రామాల్లో, పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిపివేయడం వల్ల పారిశుధ్య నిర్వహణ పడకేసింద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ప్రభుత్వం వెంటనే కుక్కకాటు దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాల‌ని కోరారు. ఇప్పటివరకు జరిగిన కుక్కకాటు ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement