సంగారెడ్డి : హైదరాబాద్ నగరం నడిబొడ్డున బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్‌లో బసవ భవన్ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనిషికి పని విలువ తెలిపిన మహనీయుడు బసవేశ్వరుడు అని పేర్కొన్నారు. 12వ శతాబ్దంలోనే కులరహిత సమాజం కోసం బసవేశ్వరుడు కృషి చేశాడని కొనియాడారు. బసవేశ్వరుడు దైవస్వరూపుడు అని తెలిపారు. బసవేశ్వరుడి గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బసవేశ్వరుడి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు . కాళేశ్వరం నుంచి సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తీసుకొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బసవేశ్వర ప్రాజెక్టు అని పేరు పెట్టామని హరీశ్‌రావు తెలిపారు. సినిమా హీరో రజినీకాంత్ కూడా సీఎం కేసీఆర్ పరిపాలనను మెచ్చుకున్నారని, హైదరాబాద్ ఓ న్యూయార్క్‌లా కనిపిస్తుందని రజినీకాంత్ కొనియాడిన వ్యాఖ్యలను హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్‌పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి, రాష్ట్ర చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎరోళ్ళ శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement