ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభ న్యూస్): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు ఇవ్వాల (శనివారం) శంకుస్థాపన చేశారు. వాగు అవతలి గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరంగా మారనున్నదని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. అన్నీ సౌకర్యాలు, సదుపాయాలతో గట్లమల్యాల గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.
మారుమూల గ్రామమైన గట్ల మల్యాలలో రూ.1.63 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పనులకు మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు. అంతకు ముందు గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో పీరీల పండుగ సందర్భంగా దట్టి కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్కెన్నపల్లి మోడల్ స్కూల్ నుంచి సీతారాంపల్లి వరకూ రూ.1.33 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.
నంగునూరు మండలంలోని వాగు అవతలి గ్రామాలకు ఉపయోగమయ్యేలా పీహెచ్ సీ కేంద్రాన్ని తెచ్చుకున్నామని తెలిపారు. ఒకప్పుడు రోడ్డు లేక.. ఆనాడు కేసీఆర్ శ్రమదానం చేసి వాగు అవతలి గ్రామాలకు రోడ్డు నిర్మిస్తే, అదే కేసీఆర్ ఆశీస్సులతో ప్రభుత్వ ఆసుపత్రి తెచ్చుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి వాగు అవతలి గ్రామ ప్రజా సౌకర్యార్థం, గర్భిణులు, డయేరియా, మలేరియా, డెంగీ తదితర జ్వరాలు వచ్చిన సమయంలో మంచి వైద్యాన్ని అందించేలా ఈ పీహెచ్ సీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక్కడ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఏం తదితర వైద్య సిబ్బందితో అన్నీ రకాల వైద్యం అందేలా ఈ ఆరోగ్య కేంద్రం ఉండబోతోందని తెలిపారు.
ప్రజలకు మంచి ఆరోగ్యం, వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన, పీహెచ్ సీలు, ఏరియా ఆసుపత్రి, టీచింగ్ ఆసుపత్రి.. ఇలా వైద్యాన్ని ఐదు అంచెలుగా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామం నుంచి సూపర్ స్పెషాలిటీ వరకూ అన్నీ రకాల వైద్యం అందేలా సిద్ధిపేటలో అందుబాటులో రాబోతున్నదని, ఇప్పటికే సిద్ధిపేటలో 900 పడకల ఆసుపత్రి, నంగునూరులో సీహెచ్ సీ 50 పడకల ఆసుపత్రి, ఇప్పుడు గట్లమల్యాలలో పీహెచ్ సీ ఆసుపత్రి ఉన్నాయని చెప్పుకొచ్చారు.