హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని… డబుల్ గ్రోత్ ఇంజన్ అంటూ అన్ని రంగాలను సర్వనాశనం ప్రధాని మోడీ చేశారని తెలంగాణ అర్ధిక మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.. శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, స్థానిక బిజెపి నేతల నుంచి కేంద్రంలోని పెద్ద తలకాయలకు సైతం తన పదునైన మాటలతో తలంటారు హరీష్. నోట్లు రద్దు చేసి ప్రజలను రోడ్డున పడేశారని,రైతు చట్టాలతో రైతులకు క్షోభకలిగించారిన మోడీ తప్పులను ఎత్తి చూపారు. నల్లధనం తెచ్చి, ప్రజల ఖాతాల్లో వేస్తామని మోడీ చెబితే.. ప్రజలు జన్‌ధన్ ఖాతాలు తెరిచి ఎదురుచూస్తున్నారన్నారు.. ఈ దేశ ప్రజలను మోడీ ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారని, అర్హులైన వాందరికి ఇండ్లు అని ప్రకటించారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారని అయితే ఒక్కటి కూడా మోడీ చేయలేకపోయారని అన్నారు…
ఇక జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్ అయిందన్నారు. ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో, రూ. 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో, సిలిండర్ ధరలు పెంచడంలో, పసి పిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని హరీశ్‌రావు చురకలంటించారు.
చివరకు పారాసిటామల్ మెడిసిన్ ధరను కూడా మోడీ ప్రభుత్వం పది శాతం పెంచిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. కరోనా తర్వాత పారాసిటామల్ వాడకం ఎక్కువైందన్నారు. ఇదే అదునుగా భావించిన కేంద్రం ఆ మెడిసిన్స్ ధరలు పెంచడం సరికాదన్నారు. ఒక్క పారాసిటామల్ మెడిసిన్ ధరలే కాదు.. 898 మెడిసిన్‌ల రేట్లు 10.7 శాతం పెరిగాయన్నారు. భారతదేశ చరిత్రలో ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో అత్యవసర మందుల ధరలు పెంచిన దుర్మార్గ చరిత్ర ఇంకెవరికీ లేదన్నారు. ఆ ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతలు చూస్తే.. అవార్డులు, పురస్కారాల లిస్టే ఒక సెషన్ అంతా చెప్పొచ్చు అని హరీశ్‌రావు అన్నారు. విపపక్షాలపై మాట్లాడుతూ, నిండు పున్నమిలో ఉన్న చందమామ వెలుగులు చూడాల్సింది పోయి ఆ చందమామ మీద ఉన్న మచ్చలను వెతికే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ లో సింహభాగాన్ని పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం కేటాయించామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే బిఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తేటతెల్లం చేశారు.. కెసిఆర్ ఫామ్ హౌజ్ లో గో పూజలు చేసినా విపక్షాలకు క్షుద్ర పూజలుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.. ఫామ్ హౌజ్ కి వస్తే అక్కడ ఏం జరుగుతుందో విపక్షనేతలకు స్వయంగా చూపిస్తామని హరీష్ అన్నారు.