హైదరాబాద్. రైతులపై ప్రభుత్వ తీరు అమానుషమని … లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ‘ఎక్స్’ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు
లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూ సేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం సరికాదన్నారు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరైందికాదని.. ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని, ప్రజాభిప్రాయాన్ని తీలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం తెలియాలన్నారు.
ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని హరీష్‌రావు మరోసారి డిమాండ్ చేశారు.
పిచ్చోడి చేతిలో రాయికాగా
తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయే ఇప్పుడు వికారాబాద్ రైతన్నలపై పడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌పై ఉన్న కోపాన్ని రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై చూపారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు దగ్గర్లో ఫార్మా సిటీ కోసం 15 వేల ఎకరాలను కేసీఆర్ హయాంలో సేకరించామని, అన్ని అనుమతులు తెచ్చామని గుర్తు చేశారు. అలాంటి భూమిని వదిలేసి.. పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టడం తగదన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని సీఎం తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్యను తెచ్చిపెట్టారన్నారు.