పిచ్చి కాగితంపై కాదు..స్పీకర్ ఫార్మెట్ లో
రాజీనామా లేఖ సిద్ధం చేసుకో..
ఆగస్ట్ 15వ తేది లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా
ఎన్నికల ప్రచారంలో ఉండి గన్ పార్క్ కి రాలేకపోయా
వివరణ ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి గన్ పార్క్ కి రాలేకపోయానని, అయినా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌తో సమవేశమైన ఆయన మీడియాతో మాట్లాడుతూ… హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. పంద్రాగస్టులోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. హరీష్ రావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్ లో సిద్ధంగా ఉంచుకోవాలని రివర్స్ ఛాలెంజ్ చేశారు.
రైతుల సమస్యలు తీర్చేందుకు తాము ఉన్నామని.. తీర్చలేని పరిస్థితిలో అధికారం ఎందుకు అని అన్నారు. తప్పకుండా రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీలు చేసే ఇటువంటి కుట్రలను కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర జరుగుతోందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అంటే భారతీయ బ్రిటిష్ విధానం…
బీజేపీ అంటే.. భారతీయ బ్రిటీష్ విధానం అని అభివర్ణించారు రేవంత్ రెడ్డి. మోడీ, అమిత్ షా బ్రిటీష్ విధానంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలనేదే వారి విధానమని తెలిపారు. బీజేపీకి ఈ భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెళ్లో ఉండాలి.. అంతేగాని రోజూ రోడ్డుమీద దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటం వారికే చెల్లుతుందని విమర్శించారు.
సెమీస్ లో బీఆర్ఎస్ ను ఓడించాం.. ఫైనల్స్ లో బీజేపీని చిత్తు చేస్తాం..
పండుగలు వస్తే చాలు బీజేపీ సమస్యలు సృష్టించడానికి రెడీగా ఉంటుందని అన్నారు. టెస్టులు, వన్డే మ్యాచ్‌లు ఆడే రోజులు ఇవి కాదని.. ఇప్పుడంతా టీ20 ట్రెండ్ నడుస్తోందని అన్నారు. సెమీ ఫైనల్లో కేసీఆర్‌ను ఓడించాం.. ఇక ఫైనల్లో మోదీని ఓడించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికలలో 12 నుంచి 14 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.