Monday, September 16, 2024

TS: ఈడీ, ఐటీ దాడులతో వేధింపులు.. హరీశ్ రావు

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను లొంగదీసుకునే ప్రయత్నం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. గురువారం పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి హ‌రీశ్ వచ్చారు. ఈడీ అధికారుల సోదాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బిహార్, గుజరాత్​లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదని ప్రశ్నించారు.

నీట్ పరీక్షాపత్రాన్ని అమ్ముకున్న కేంద్రం…
తెలంగాణ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాశాయి. వారి భవిష్యత్తు అయోమయంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురి చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ అధికార పార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా, కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయటం దారుణమన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ధర్మం గెలుస్తుందని హరీశ్ రావు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement