Monday, November 25, 2024

TG: ప్రిన్సిపాల్ వేధింపులు.. పోలీస్ స్టేషన్ లో నిరసనలు

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : మహాత్మ జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ వేధింపుల నుండి తమను రక్షించాలని కోరుతూ హై స్కూల్ విద్యార్థులు గురువారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మొరపెట్టుకున్న సంఘటన ఇది. తమ సమస్యలు చెప్పుకుంటే బెదిరించి వేధిస్తున్నారని, ప్రిన్సిపాల్ సంగీత ఆగడాలు ఇక సహించే ఓపిక లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో బైఠాయించారు.

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మావల మండలంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే (జైనథ్) బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో అనేక సమస్యలతో విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. మౌలిక వసతులు, విద్యార్థులకు అరకొరగా అందిస్తున్న మెనూ తదితర సమస్యలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన కూడా చేశారు. అయితే రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలను బయటకు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ సంగీత రోజూ వేధిస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం సరైన భోజనం కూడా ఇవ్వడం లేదని ఇరుకు గదులు, సమస్యల మధ్య సహవాసం చేస్తున్నామన్నారు.


గోడ దూకి.. 6 కి. మీ. కాలినడకన స్టేషన్ కు…
గురువారం వేకువజామున మూడు గంటలకే మూకుమ్మడిగా 46మంది విద్యార్థులు గోడ దూకి టూ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తమ సమస్య ఎవరికి చెప్పాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ కు వచ్చామని, తమ బాధలు వర్ణణాతీతమని వాపోయారు. గోడ దూకి ఆరు కిలోమీటర్లు కాలినడకన నడిచి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మూడు గంటల పాటు స్టేషన్లోనే కూర్చుని నిరసన తెలపడంతో టూ టౌన్ సిఐ కరుణాకర్ అక్కడికి అల్పాహారం తెప్పించి తినిపించారు. ఆ తర్వాత వారి సమస్యలను జిల్లా ఎస్పీ ద్వారా కలెక్టర్ కు చేరవేశారు. ఆర్డీవో తో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో హైస్కూల్ విద్యార్థులు ఆందోళన విరమించి తిరిగి రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్నారు. ప్రిన్సిపాల్ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరిన ఘటన ఆదిలాబాద్ లో చర్చ నీయాంశమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement