హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి రూట్ మ్యాప్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గౌలిగూడ, ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైస్రాయ్ హోటల్ వెనుక, కవాయిగూడ, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాల పేట్ పిఎస్ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగున్నాయి.
హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు.
హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామమందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు సాగుతుంది. ఇవాళ ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. కూడళ్లలో 44 డైవర్షన్ పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి.
ఈ శోభయాత్ర సాగే రూట్ మ్యాప్ లో 450 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి శోభాయాత్ర పర్యవేక్షణ చేస్తున్నారు. వెహికిల్ మౌంటెడ్ జూమ్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. షి టిమ్స్, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీం, సిటి టాస్క్ ఫోర్స్ , రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటి ఆర్మ్ రిజర్వ్ పోలీస్, తెలంగాణ పోలీస్ బెటాలియన్, క్రైమ్,మఫ్టి టీం పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.