కొండగట్టు ఆలయంలో జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగుతున్నాయి. శనివారం పెద్ద హనుమాన్ జయంతి కావడంతో భక్తులు తండోప తండాలుగా తరలివస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ క్యూలైన్లు మొత్తం నిండి పోయాయి. స్వామి వారి జయంతి సందర్భంగా ఉదయం 3 గంటల నుండి తిరుమంజనం, ప్రబంధ పారాయణములు, సహస్ర నాగవల్లి అర్చన, హోమం, మహా పూర్ణాహుతి, స్నాపన తిరుమంజనం, ఉయ్యాల సేవ, మంత్రపుష్పం, మహా నివేదన, తీర్థ ప్రసాద వినియోగం, సామూహిక భజన తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కల్యాణ కట్ట, ప్రసాదం కౌంటర్లు, కోనేరు, మాల విరమణ మండపం ఎక్కడ చూసినా అంజన్న భక్తులతో కిక్కిరిసిపోయింది.