హన్మకొండ – రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్ కి రేపు ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ సిపిఐ హనుమకొండ, వరంగల్ జిల్లా సమితిల ఆద్వర్యంలో శుక్రవారం హనుమకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ కార్యాలయం నుండి ఏకశిలా పార్కు వరకు ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఏకశిలా పార్కు ఎదుట వందలాది మంది సిపిఐ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలోని కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు. నేడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే కాజీపేటలో ఉన్న పీరియాడికల్ వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ స్థానంలో వ్యాగన్ రిపేర్ సెంటర్ అని, తాజాగా వ్యాగన్ మ్యానిఫాక్చరింగ్ యూనిట్ అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహరాష్ట్ర లాతూర్ లో, గుజరాత్ లో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారని, విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీని మరుగున పరిచేందుకే కేవలం 521 కోట్లతో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పిఓహెచ్)ను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ యూనిట్ పేరుతో మభ్య పెడుతున్నారని విమర్శించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ వస్తే ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవని, గిరిజన యూనివర్సిటీ ద్వారా గిరిజన విద్యార్థులకు మేలు జరిగేదని అన్నారు.
వరంగల్ లోని మామునూర్ ఏయిర్ ఫోర్టును అభివృద్ధి పరచలేదని, గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమనూ వరంగల్ లో ఏర్పాటు చేయలేదని అన్నారు. విభజన హామీలపై తాము ఇప్పటికే ప్రజా పోరు యాత్ర నిర్వహించామని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా రోడ్డెక్కాలని, అన్ని పార్టీలు కలిసి కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. తమకు రాజకీయ దురుద్దేశం లేదని, ప్రజల కోసమే ఉద్యమిస్తున్నామని, రాజ్యాంగ పద్దతులలో శాంతియుత నిరసన తెలుపుతున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా సిపిఐ కార్యకర్తలు గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ, విభజన హామీలు నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు సహా సిపిఐ నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషను కు తరలించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి,మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు మారుపాక అనిల్ కుమార్, మండ సదాలక్ష్మి, ఆదరి శ్రీనివాస్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, గన్నారపు రమేష్, గుండె బద్రి, మునగాల బిక్షపతి,కొట్టెపాక రవి, బాషబోయిన సంతోష్, ల్యాదెళ్ల శరత్, మాలోతు శంకర్, మంచాల రమాదేవి, కండె నర్సయ్య, దేవా, దస్రూ తదితరులు పాల్గొన్నారు.