హైదరాబాద్, ఆంధ్రప్రభ: పీజీ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఉన్న సీట్లకు భర్తీ అవుతున్న సీట్ల మధ్య వ్యత్యాసం భారీగా ఉంటోంది. ప్రతి ఏటా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎస్డబ్ల్యూ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. యూనివర్సిటీల్లో మాత్రం సీట్లు నిండుతున్నప్పటికినీ ఆయా యూనివర్సిటీ అనుంబంధ కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు అరకొరగానే నిండుతున్నాయి. పీజీ ఎంట్రెన్స్ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియను మూడు, నాలుగు విడతల్లో చేపడుతున్నాగానీ కాలేజీల్లో సీట్లు కనీసం 60 శాతం కూడా నిండట్లేదు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయు యూనివర్సిటీ పరిధిల్లో 44వేలకు పైగా సీట్లు ఉంటే, అందులో 22,812 సీట్లు మాత్రమే 2021 ఏడాదిలో నిండాయి. కొత్తగా ఏర్పాటైన మహిళా విశ్వవిద్యాలయంతో కలుపుకొని మొత్తం 8 వర్సిటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరాని 44,604 సీట్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఏమైనా కొత్త కోర్సులను ప్రవేశపెడితే అదనంగా మరో 1000 సీట్లు పెరగనున్నాయి. విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 320 కాలేజీల్లో 50 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
పీజీలో అమ్మాయిలదే హవా…
పీజీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా కొనసాగుతోంది. మొత్తం 44 వేలకు పైగా సీట్లుంటే అందులో 71 శాతం మంది అమ్మాయిలు గతేడాది ప్రవేశాలు పొందగా, అబ్బాయిలు కేవలం 29 శాతం మంది మాత్రమే పొందడం గమనార్హం. ఈ ఏడాది నుంచి మహిళా విశ్వవిద్యాలయం సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పీజీ కోర్సుల్లో చేరే మహిళల సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కోర్సులకు దూరంగా…
యువత సాంప్రదాయ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి కోర్సులకు దూరంగా ఉంటున్నారు. ఎక్కువగా వృత్తి విద్యా, సాంకేతిక కోర్సులను పూర్తిచేసి ఉద్యోగాలను దక్కించుకుంటున్నారు. ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, ఎంఎస్సీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఫిజక్స్తో పాటు ఎంఎస్డబ్ల్యూ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ సమస్య ప్రైవేట్ కాలేజీల్లోనే కాదు ప్రభుత్వ కాలేజీల్లోను ఉంది. గజ్వేలోని ఓ ప్రభుత్వ కాలేజీల్లో గతేడాది ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో ఐదుగురు మాత్రమే జాయిన్ అయ్యారు. దాంతె అక్కడి విద్యార్థులను వేరే కాలేజీకి షిప్ట్ చేశారు. ఉస్మానియా పరిధిలో 15,300 సీట్లకు గానూ 9172 సీట్లు మాత్రమే నిండాయి. మిగతా వర్సిటీల పరిస్థితి కూడా ఇంతే. ఎంకామ్లో 8092 సీట్లకు 3104 సీట్లు భర్తీకాగా, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 4784 సీట్లకు 2095 సీట్లు, 4023 కెమిస్ట్రీ సీట్లకు 2889 సీట్లు, ఎంఎస్డబ్ల్యూ 1306 సీట్లకు 492 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇలా అన్ని కోర్సుల్లోనూ సగం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.
ఇతర కాలేజీలకు షిఫ్టింగ్…
మొదటి విడత కౌన్సెలింగ్లో కనీసం 10 సీట్లు కూడా నిండకుంటే అప్పటికే అందులో సీటు పొందిన విద్యార్థులకు ఇతర కాలేజీలకు షిఫ్ట్ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఫస్ట్ ఫేజ్లో కేటాయించిన సీటును రద్దు చేసుకొని సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్లో పాల్గొనేలా విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. తద్వారా విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.