అసెంబ్లీలో హరీష్ రావు ఆగ్రహం
మంత్రి సీతక్క వ్యాఖ్యలకు కౌంటర్
పెన్షన్ లేట్ చేయడంపై నిలదీత
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: సరే మేం తప్పు చేశాం.. మీరూ అదే చేస్తారా? అదే చేస్తే ఈ సారి మేము అక్కడ కూర్చుంటాం, మీరు ఇక్కడ కూర్చుంటారు.. అని శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనటంతో.. నిజం ఒప్పుకున్నారని సభలో సభ్యులు చెవుల్లో గొణుక్కున్నారు. అసలేం జరిగిందంటే, అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న తరుణంలో రెండు నెలలుగా సంక్షేమ పెన్షన్ చెల్లింపుల్లో జాప్యంపై ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. జూన్ నుంచి ₹4 వేల పెన్షన్ చెల్లించటం లేదని, మరో రెండు రోజుల్లో ఆగస్టు నెల వస్తుందని గుర్తుచేశారు. ఇందుకు మంత్రి సీతక్క ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. 2020 జులై నెలలో పెన్షన్ ఇవ్వకుండా నెలరోజులు ఆలస్యం చేశారని, అప్పటి నుంచి ఒక నెల లేటవుతోంది. నా దగ్గర ఆన్ రికార్డు ఉంది, అధికారులు కూడా ఉన్నారని చెప్పారు..
మీరెంత లేటు చేశారో రికార్డులు చూడండి..
ఇంకోటి చేయూత, చేయూత అంటున్నారు. 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెన్షన్ల వయస్సును 65 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు కుదిస్తామన్నారు. మూడున్నర ఏళ్ల తరువాత అమలు చేశారు. ఇక ఉద్యోగాలు చేస్తూ 24 వేలు, 30 వేలు పెన్షన్లు తీసుకునే వారికి కూడా రెండు వేల పెన్షన్ వర్తింప జేశారు. సుమారు 5000 మందికి డబుల్ డబుల్ పెన్షన్లు ఇచ్చారు. అంతే కాదు, కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ కూడా చైర్మన్ గా అలవెన్సులు తీసుకుంటూ ఆరు వేల పెన్షన్లు కూడా ఉన్నాయి. ఇవ్వన్నీ నిరూపిస్తా. అద్బుతంగా అబద్దాలను మా మీద ప్రచారం చేస్తున్నారు. మీరు ఉన్నప్పుడు కూడా పాలనలోనే 31వ తారీఖు, 16వ తారీఖు, 20 వ తారీఖు, 27 వ తారీఖున పెన్షన్లు ఇచ్చారు. 2014 నుంచి డేటా మొత్తం నా దగ్గర ఉంది. మీరేదో మీరు చెప్పేదో కరెక్టు చెప్పి, మిగితా వాళ్లంతా తప్పు, మేం తప్పా ఈ దేశాన్ని బాగా పరిపాలించేటోళ్లు లేరు , అందరు తప్పు అని మాట్లాడటం సరికాదు, హరిష్ రావు గారికి రికార్డులు ఇస్తా చూసుకోవాలని సీతక్క అన్నారు. ఇందుకు సమాధానంగా హరిష్ రావు మాట్లాడుతూ, వీరు ఎంత సేపూ మావి చెబుతున్నారు, మేం తప్పు చేశాం కాబట్టే ప్రతిపక్షంలో జనం కూర్చొబెట్టారు, మీరు అదే తప్పు చేస్తారా? అలా చేస్తే మీరు ఇక్కడికి వస్తారు, మేం అక్కడ కూర్చుంటాం అని అన్నారు.