Tuesday, November 19, 2024

వడగండ్ల వాన.. దెబ్బతిన్న పంటలు..

దుబ్బాక : దుబ్బాక మండలంలో ఈదురుగాలుల‌తో కూడిన వడగండ్ల వాన కురిసి చేతికంది వచ్చిన వరిపంట నేలపాలైంది. నాలుగైదు రోజుల్లో పంట కోతలు మొదలు పెడుదామనుకుంటున్న పరిస్థితుల్లో ప్రకృతి పగబట్టినట్లుగా రైతన్న బతుకులను ఆగం చేసింది. ఎంతో శ్రమించి పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక మున్సిపల్‌ పరిధిలో దుబ్బాక పట్టణంతో పాటు చెల్లాపూర్‌, మల్లాయపల్లి, మండల పరిధిలో బల్వంతాపూర్‌, పద్మశాలిగడ్డ, రాజక్కపేట ప్రాంతాల్లో వడగండ్ల‌ వాన కురిసి పంట నష్టానికి కారణమైంది. దుబ్బాక పట్టణ శివార్లలోని గుండెల్లి లక్ష్మారెడ్డికి చెందిన వరిపంట నష్టానికి గురవడం, అరటి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు విరిగి పడిపోయాయి. అదే విధంగా వరి విత్తనాలు రాలిపోయాయి.

గుండెల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నరేష్‌ రెడ్డి సోదరులకు చెందిన 12 ఎకరాల వరి పంట నష్టానికి గురవడంతో పాటు వారు నిర్మించుకున్న పశువుల కొట్టాల రేకులు, ఇనుప పైపులు కూడా గాలికి ఎగిరిపోయాయి. చెల్లాపూర్‌ శివారు చుట్టూ ఉన్న గ్రామాలైన మల్లాయపల్లి, పద్మశాలిగడ్డ, బల్వంతపూర్‌, రాజక్కపేట గ్రామాలతో పాటు దుబ్బాక డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పరిసరాలు కలిసే దుబ్బాక శివారు ప్రాంతంతో కలిపి మొత్తం 2,200 ఎకరాలకు పైగా వరిపంట పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని దుబ్బాక వ్యవసాయ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. వడగండ్ల వానకు సంబంధించిన సమాచారం రావడంతోనే ఆయా గ్రామాల ఏఈవోలతో పాటు తాను కూడా గ్రామాలన్నీ తిరిగి పంట నష్టపోయిన రైతుల వివరాలు తెలుసుకుని, పంటను కూడా పరిశీలించానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement