Wednesday, November 20, 2024

TS: వడగళ్ల బీభత్సం.. నిజామాబాద్ జిల్లాలో రాళ్ల వాన‌..

నీట మునిగిన పంట పొలాలు
క‌ల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో త‌డిచిన వ‌డ్లు
వ‌రంగ‌ల్‌, సిద్దిపేట జిల్లాల్లోనూ తీవ్ర న‌ష్టం
నేల‌కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్‌పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. టార్పాలిన్లు లేకపోవడంతో వరదలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం నీటిపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వారం రోజులైనా ధాన్యం కాంటా అవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తాము నష్టపోయామంటున్నారు.

ఈదురుగాలుల‌తో నేల‌కొరిగిన చెట్లు…
గాలివాన బీభత్సంతో చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల స్తంభాలు విరిగిపోయాయి. అర్ధరాత్రి నుంచి పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నందిపేట మండలం ఖుద్వాన్‌పూర్‌లో పిడుగుపడి మూడు బర్రెలు మృతిచెందాయి.

- Advertisement -

సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, నంగునూరు, రాయపోల్‌ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. నంగునూరు మండలం సిద్ధన్నపేటలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.

ఉమ్మడి వరంగల్‌లో..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా భారీ వాన కురిసింది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటతోపాటు ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. జనగామ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌లో, తరిగొప్పుల మండలంలో భారీ వర్షం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement