Monday, November 25, 2024

Kidney racket : కేర‌ళ‌లో కిడ్నీ రాకెట్ గుట్టుర‌ట్టు…

ప్ర‌ధాన నిందితుడిగా హైద‌రాబాద్ డాక్ట‌ర్
భాగ్య‌న‌గ‌రం కేంద్రంగానే కిడ్నీ అమ్మ‌కాలు
పేదింటి వారి అవ‌స‌రాలే వారి పెట్టుబ‌డి
ఇరాన్ తీసుకెళ్లి అక్క‌డ కిడ్నీ డోనేష‌న్లు
ఒక్కో కిడ్నీకి రూ.20ల‌క్ష‌లు డిమాండ్
డోన‌ర్ కు ఇచ్చేది మాత్రం ఆరు లక్ష‌లే
మ‌రికొంద‌రు డాక్డ‌ర్స్ కోసం కేర‌ళ పోలీసులు
హైద‌రాబాద్ లో గాలింపు


ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్య తరగతి యువకుల కిడ్నీలను కంత్రీగాళ్లు కొట్టేస్తున్నారు. కిడ్నీలు చెడిపోయాయంటూ అమాయక ప్రజలను నమ్మించి అవి సంపన్నుల దగ్గర లక్షలు బేరం పెట్టి పేదల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాలు అన్నీఇన్నీ కావు. తాజాగా కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీసులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేద యువకులకు డబ్బు ఆశ చూపి 40మంది కిడ్నీలను ఇప్ప‌టికే ఇడ్లీల్లా అమ్మేశారు.

అయితే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు మృతిచెందడంతో విషయం బయటపడింది. కేరళలో వెలుగు చూసిన ఈ భాగోతానికి ముఠా మాస్టర్‌ హైదరాబాద్‌కు చెందిన వైద్యుడుగా గుర్తించారు పోలీసులు. ఇరాన్ నుంచి కొచ్చికి వచ్చిన ముఠాలోని కీలక సభ్యుడు డాక్ట‌ర్ సబిత్‌ను కేరళ పోలీసులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అత‌డిని అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

- Advertisement -

రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం.. కేర‌ళ‌లోని పాల‌క్కాడ్ కు చెందిన‌ సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం అతను డాక్టర్ కావ‌డ‌మే. హైదరాబాద్ లో అత‌డు ప్రాక్టీస్ చేస్తున్న సంద‌ర్భంలో కిడ్నీ డోనేష‌న్ పై అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చుకున్నాడు.. కిడ్నీ ఇస్తే ల‌క్ష‌ల్లో న‌గ‌దు ద‌క్కుతుంద‌ని తెలుసుకున్నాడు.. డాక్ట‌ర్ గా ఇత‌రుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌రుకున్న డాక్ట‌ర్ సబిత్ బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన 40మంది యువకులను ఇరాన్‌కు తీసుకెళ్లి వారి కిడ్నీలను విక్రయించినట్లు అంగీకరించాడు. డబ్బు అవసరం ఉన్న పేద యువతకు దళారులు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి కిడ్నీలు అమ్ముకునేలా మభ్యపెడుతున్నారు. కొందరు బ్రోకర్లు వారికి పాస్ పోర్టులు, వీసాలు సిద్ధం చేసి ఇరాన్ కు తీసుకెళ్తున్నారు. ఇరాన్‌లో రక్తసంబంధీకులు కాని వారికి అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే వారిని అక్కడికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఏ కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ణయించిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేస్తారు.

డబ్బు అవసరం ఉన్న యువతను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20లక్షల వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి, రూ.6లక్షలు ముట్టజెబుతున్నారు. డోనర్లు ఇరాన్‌ వెళ్లేందుకు కావాల్సిన పాస్‌పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూరుస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు నుంచి డోనర్లు ఇరాన్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ రాకెట్ ప్ర‌మేయం ఉన్న మ‌రికొంద‌రు డాక్ట‌ర్ల కోసం హైద‌రాబాద్ లో కేర‌ళ పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు.. ఇరాన్ లో కిడ్నీ మార్పిడి, అమ్మ‌కాల‌పై ఎటువంటి ఆంక్ష‌లు లేక‌పోవ‌డంతోనే ఆ దేశాన్ని స‌బిత్ ఎంచుకున్నాడు.. అలాగే మ‌రికొంద‌రు కిడ్నీ బాధితుల‌ను కూడా ఇరాన్ తీసుకెళ్లి అక్క‌డ కిడ్నీ మార్పిడి చేసి వారి నుంచి భారీగా డ‌బ్బు తీసుకున్న‌ట్లు కూడా ప్ర‌ధాన నిందితుడు స‌బిత్ పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement