కృష్ణ జలాల విషయంలో తెలుగురాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ, ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కృష్ణ జలాలను దోచుకుపోవాలని అప్పట్లో వైఎస్సార్ దుర్బుద్ధితో వ్యవహరిస్తే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా అదే తీరుతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. ఏపీ నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు అన్యాయం జరుగుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ పాలనలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని ఆరోపించారు. దీనిని అప్పట్లో తాము వ్యతిరేకించామని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ కూడా అటువంటి చర్యలకే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం డ్యామ్ నుంచి 800 ఫీట్లు నుంచే నీళ్లు తీసుకుపోతానమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దీని వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్ మాత్రం చాటుగా పనులు చేసుకుంటున్నారని మండిపడ్డారు.