Tuesday, November 26, 2024

Telangana: గ్రూప్‌-1, పోలీస్‌ ఉద్యోగాలపై స్టే ఇవ్వాలని పిల్‌.. కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 9.8 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు సోమవారం కొట్టి వేసింది. గ్రూప్‌-1, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలన్న అఖిల భారత గిరిజన సమాఖ్య అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారని, జనాభా దామాషా ప్రకారం 9.8 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.

ఏ చట్టం ప్రకారం తప్పనిసరిగా ప్రభుత్వం 9.8 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలో పిటిషన్‌లో వివరించలేదని పేర్కొన్న సీజే జస్టీస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం విచారణకు నిరాకరించింది. చట్టబద్ధత వివరిస్తూ అవసరమైతే మరో పిల్‌ వేసుకోవాలని సూచించింది. గ్రూప్‌ – 1 ధరఖాస్తు ప్రక్రియ ముగియడంతో తొలిదశ వడపోత పరీక్ష నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు ఆరంభించింది. అత్యధికంగా 503 పోస్టులతో వెలువడిన ఈ ప్రకటనకు రికార్డు స్థాయిలో 3,80,202 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

ఉద్యోగ ప్రకటనలో జులై లేదా ఆగస్టు నెలల్లో ప్రిలిమనరీ ఉంటుందని కమిషన్‌ గతంలో ప్రకటించింది. అయితే సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్స్‌, బ్యాంకు, పోలీసు కొలువుల పరీక్షలకు షెడ్యూల్‌ ఇప్పటికే ఖరారైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రిలిమ్స్‌ తేదీపై ముందుకు రావాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.

రాష్ట్రంలో పోలీస్‌ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షలను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు తొలివారంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నారు. అభ్యర్థుల వడపోతగా భావించే ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలను సెప్టెంబర్‌లోగా ప్రకటించాలనే ప్రయత్నాల్లో ఉన్నామని నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు చెప్పారు.

అక్టోబర్‌ రెండోవారంలో శారీరక సామర్థ్యం (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహిస్తామని, నవంబర్‌లోగా ఫలితాలిస్తామని.. జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాత పరీక్షలు ఉంటాయన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మార్చిలోపు తుది ఫలితాల్ని ప్రకటిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement