Saturday, June 29, 2024

TS: బండి సంజయ్‌ను కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు..

గ్రూప్-1 అభ్య‌ర్థులు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ ను క‌లిశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు ఆయ‌న‌ను కోరారు. గత నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని వారు మంత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని నిరుద్యోగులు గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చి 6 నెలలైనా పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు వాపోయారు. గ్రూప్ 1 పోస్టులు అత్యధికంగా ఉండటం వల్ల 1: 50 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తే నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్య‌క్తం చేశారు. కేరళ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ కు 1:75 చొప్పున ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేశారన్నారు.

ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భారీ ఎత్తున ధర్నా చేస్తామ‌ని నిరుద్యోగులు తెలిపారు. నిరుద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయాలని బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement