Friday, November 22, 2024

గ్రీన్ఇండియా చాలెంజ్.. మొక్కలు నాటిన విరాటపర్వం చిత్ర యూనిట్

ఈ మ‌ధ్య‌నే విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకున్న విరాట‌ప‌ర్వం మూవీ టీమ్ ఇవ్వాల గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంది. ఈ సినిమా తెలంగాణ‌లోని మ‌రుపురాని, మ‌రిచిపోలేని ఇన్సిడెంట్‌ని మ‌రోసారి యాదికి చేసింది.. ప్ర‌తి ఇంట్లో అప్ప‌ట్లో నెల‌కొన్న ఆందోళ‌న‌ను, గాయపడ్డ జీవితాలను, విద్యార్థుల పోరాట త‌త్వాన్ని ఈ మూవీలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ఉత్త‌ర తెలంగాణ ప్రాంతంలో అన్న‌ల (న‌క్స‌ల్స్‌) నేప‌థ్యం.. భూ పోరాటాలతో పాటు, సీపీఐ ఎంల్ పార్టీల్లో ఉన్న వైరుధ్యాల‌ను ఈ మూవీ వెల్ల‌డి చేస్తుంది. సిద్ధాంత ప‌ర‌మైన విభేదాల‌తో క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు, లెనినిస్టు పేరుతో ప‌లు గ్రూపులు ఏర్ప‌డ్డాయి. వీటితో మ‌మేక‌మైన సామాన్యుల జీవితాల‌ను ఈ సినిమాలో చూడొచ్చు..

కాగా, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఇవ్వాల జూబ్లీహిల్స్ జీహెచ్ ఎంసీ పార్క్ లో విరాటపర్వం చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల, నటుడు నవీన్ చంద్ర, సినిమాటోగ్రాఫర్ డానీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్ట‌ర్‌ వేణు, నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ.. గ్రీన్ఇండియా చాలెంజ్ ఐదో వసంతంలోకి అడుగుపెట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి గొప్ప కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement