హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీచర్ల స్పౌజ్(దంపతులు) బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్పౌజ్ బాధితులు సుదీర్ఘకాలంగా కోరుతున్న బదిలీల సమస్య దీంతో ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. టీచర్ల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ఈ మేరకు ప్రభుత్వం అను మతినిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దంప తులను ఒకేచోటకు బదిలీ చేయాలని స్పౌజ్ టీచర్లు గత కొంత కాలంగా దశలవారీగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో బ్లాక్ చేసిన 13 జిల్లాల్లోని దంపతుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. నిలిపివేసిన 13 జిల్లాలో ఖాళీలకు అనుగుణంగా ముందస్తుగా 615 మంది స్పౌజ్ బదిలీలకు విధ్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ
మరోవైపు రాష్ట్రంలో నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈమేరకు జీవో నెంబర్ 5ను జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరుగుతాయిని అందులో ఆమె స్పష్టం చేశారు. ఈరోజు (శుక్రవారం) కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం) పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఈ నెల 28వ(రేపటి నుండి) తేదీ నుంచి 30వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే దీనికి మూడు రోజులు మాత్రమే గడువు విధించడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికొన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈవోలకు, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపా ధ్యాయులకు సమర్పించాలి.
అలాగే హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సంబంధిత జిల్లా డీఈవోకు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీలోపు సమర్పించాలి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6 వరకు దరఖాస్తలు హార్డ్ కాపీలను డీఈవో కార్యాలయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు సమర్పించిన తర్వాత దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్‌లో ఆమోదం జరుగుతాయి. ఫిబ్రవరి 7న డీఈవో, ఆర్‌జేడీ వెబ్‌సైట్లలో బదిలీలు, పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు సీనియారిటీ జాబితాపై 3 రోజుల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటనతోపాటు, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఫిబ్రవరి 13న మల్టిdజోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పున:పరిశీలన చేస్తారు. ఫిబ్రవరి 14న ఆర్‌జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు విడుదల చేస్తారు. అదేనెల 15న ప్రధానోపాధ్యాయుల బదిలీల అనంతరం మిగిలిన ఖాళీలను ప్రకటిస్తారు. ఈనెల 27 నుంచి మార్చి 4వ తేదీ దాకా 37 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
15 రోజుల్లో అభ్యంతరాలను పరిష్కరించాలి….
మార్చి 3న ఆప్షన్ల సవరణ, పున:పరిశీలనకు అవకాశం కల్పిస్తారు. మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ టీచర్లకు బదిలీ ఆర్డర్లు విడుదల చేస్తారు. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు డీఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్‌జేడీకి, ఆర్‌జేడీ ఉత్తర్వులపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించాలి. బదిలీలు పొందిన టీచర్లు 2022-23 విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున బదిలీ అయిన పాఠశాలలకు వెళ్లాలి.