హైదరాబాద్, ఆంధ్రప్రభ: పన్నేతర ఆదాయార్జన దిశగా ప్రణాళికలకు కదలిక వస్తున్నది. ప్రజలపై పన్నుల భారం మోపకుండా లోటును పూడ్చుకునేందుకు ఉన్న మార్గాల్లో కీలకమైన భూముల విక్రయాలకు ప్రభుత్వం తెరలేపుతోంది. ఈ దఫా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని భూములను నాలుగ8ఉ విడతలుగా విక్రయించేందుకు సిద్దమవుతున్నది. మొత్తం జిల్లాల్లో ఈ ఏడాదిలో వీలైనన్ని భూముల విక్రయాలతోపాటు, ఇతర మార్గాల్లో రూ. 30వేల కోట్లను సమీకరించుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నది. హైదరాబాద్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల్లో రూ. 15,500కోట్లు అంచనా వేసినట్లు సమాచారం.
ఇండ్లతో పాటు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు రాష్ట్రంలో విలువైన భూములు కూడా ఉండగా, వీటి పరిరక్షణ, నిర్వహణ సమస్యగా మారడంతో విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఈ ఏడాది అమలులోకి తీసుకొచ్చింది. వీటిద్వారా రూ. 6వేల కోట్లను సమీకరించుకున్నది. ఈ ఏడాది బడ్జెట్‌లో భూముల విక్రయాల రూపంలో పన్నేతర ఆదాయం రూ. 15,500కోట్లకు అంచనా వేసుకోగా ఈ దఫా విక్రయాలతో లక్ష్యం మించవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ క్రమంలో ఏడాదికాలంగా కార్పొరేషన్‌కు ఉన్న 3337 ఎకరాలను విక్రయించే అంశాలను పరిశీలిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చేల్, ఖమ్మం, కామారెడ్డి నల్గొండలలో 8047 ప్లాట్లు, 416 ఇండ్లు ఉండగా, ఇతర ప్రాంతాల్లో 685ఫ్లాట్లు, 536 ఎకరాల భూములున్నాయి.
ఇతర భూములపై కూడా…
మిగులు, ప్రభుత్వ అసైన్డ్ భూములతో పక్కా విధానంతో భారీగా రాబడి సమకూర్చుకోవాలనే ప్రతిపాదన సిద్దమవుతోంది. వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 50 వేల కోట్లకుపైగా వేలంతో ఆదాయం సమకూర్చుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలోని విలువైన భూములను ప్రత్యేకంగా తెప్పించుకుని రెవెన్యూ శాఖ అంచనాలు రూపొందించింది. ఇజ్జత్‌నగర్‌లో 36 ఎకరాలు, హైటెక్స్ సెంట్రల్ సెంటర్‌లో 8 ఎకరాలు, తెల్లాపూర్‌లో 46 ఎకరాలు, తాజాగా సుప్రీంకోర్టులో కేసు గెల్చిన ప్రభుత్వానికి స్వాధీనమైన కోకాపేటలోని 198 ఎకరాలు, మేడ్చేల్, శంషాబాద్, రాజేంద్రనగర్‌లలో ఉన్న ఎవాక్యూ భూములు, రాష్ట్రంలోని నిరుపయోగంగా ఉన్న పేవలకు పంచిన అసైన్డ్ భూముల వివరాలతో నివేదిక సిద్దం చేశారు. వీటి అమ్మకాలతో దశలవారీగా రూ. 50 వేలకోట్లు సమీకరించుకునే అవకాశాలను రెవెన్యూ శాఖ రూపొందించింది. ప్రతీ ఏటా రాబడి లోటును పూడ్చుకునేలా ప్రణాళికాబద్దంగా వేలంతో భూములను విక్రయించి రాబడిని పెంపొందించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ జిల్లాలోపాటు, అన్ని జిల్లాల్లోనూ విక్రయానికి సిద్దంగా ఉన్న భూముల వివరాలతో జాబితాను సిద్దం చేశారు. వీటికి ఎటువంటి అడ్డంకులు లేనివి, న్యాయపరమైని, కోర్టు తగాదాల్లో ఉన్నవి. చేతులు మారిన అసైన్డ్ భూముల వంటి వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ జాబితాలను నూతనంగా జిల్లాల్లో నియమించిన అదనపు కలెక్టర్లతో చర్చించి తుది నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.
పన్నేతర రాబడికి కీలకమైన నిరుపయోగ ప్రభుత్వ భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్దమైన సంగతి తెలిసిందే. నిధుల సమీకరణలో భాగంగా అత్యవసరాలకు ప్రజోపయోగ అవసరాలకు అక్కరరాని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశం ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాల దిశగా సర్కార్ అడుగులు ముందుకు వేసింది. తొలివిడతలో భూముల విక్రయాల్లో భాగంగా కోకాపేటలో 49.95ఎకరాలు, ఖానామేట్‌లో 15.10 ఎకరాలను ప్లాట్లుగా విక్రయించింది. ఈ వేలంలో రెండు మూడు అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇకపై ప్రతీ జిల్లాలో కనీసంగా 1000 ఎకరాలను మార్కెట్ ధరలకు అనుగుణంగా బహిరంగ వేలంద్వారా ఆన్‌లైన్లో విక్రయించే చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం స్టీరింగ్ కమిటీని కూడా ప్రకటించింది. విజయవంతంగా బహిరంగ వేలం నిర్వహించి గడువులోగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ముగించేలా చర్యలు తీసుకుంటోంది. టీఎస్‌ఐపాస్ విధానంలో ఈ ప్లాట్లకు, వాటిలో నిర్మాణాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులను మంజూరీ చేయనున్నారు. బహిరంగ వేలంలో విజయంవంతమైన బిడ్డర్‌కు పూర్తి నిధులు చెల్లించిన మూడు వారాల్లోగా జిల్లా కలెక్టర్ భూమిని స్వాధీనపర్చి కన్వీయన్స్ డీడ్‌ను పూర్తి చేస్తారు.
భూముల వివాదాలను కలెక్టర్లు తొలగించి సరిహద్దులను స్పష్టంగా పేర్కొంటారు. లేఅవుట్లకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఆటోమేటిక్‌గా నమోదు చేస్తారు. వారంలోపు అగ్నిమాపక, పర్యావరణ విభాగాలు పరిష్కరించి అనుమతిస్తాయి. ఇందుకు నోడల్ ఏజెన్సీగా టీఎస్‌ఐఐసీ వ్యవహరిస్తుంది. నోడల్ ఏజెన్సీలు అవసరం మేరకు ప్రైవేటు కన్సల్టెంట్లను నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. గతేడాది భూములను విక్రయించాలన్న లక్ష్యం నెరవేరకపోవడంతో రాబడి లక్ష్యం చేరలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లక్ష్యం చేరికకు పలు చర్యలు తీసుకుంటోంది. గృహనిర్మాణ, పురపాలక, పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని భూములను గుర్తించి వేలానికి చర్యలు తీసుకుంటోంది.
మరిన్ని ప్రాంతాల్లో త్వరలో వేలం దిశగా…
ప్రాంతం విస్తీర్ణం విలువ
కోకాపేట్ 32812 70
ఖాజాగూడ 6582 36
పేట్‌బషీరాబాద్ 135520 280
రాయదుర్గ్ 116206 500
ఇజ్జత్‌నగర్ 145200 500
ఖాజాగూడ 5354 15.30
కోకాపేట్ 9196 2.90
మణికొండ 4114 10.28