హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆయనే ఒక ఉద్యమం… ఆయన పేరే అభివృద్ధికి కేరాఫ్. తెలంగాణ రాష్ట్రమే కాదు… యావత్ దేశం ఎలా అభివృద్ధి చెందవచ్చో ప్రత్యేకంగా ఒక నివేదికను, విజన్‌ను ముందుపెట్టుకున్న మహానేత. ఉద్యమాలే ఊపిరిగా మొదలై తెలంగాణ స్వాప్పికుడిగా ఆ కలను సాకారం చేసుకుని దేశానికే మార్గదర్శిగా రాష్ట్ర పాలనలో అద్భుతాలను సృష్టించిన సీఎం కేసీఆర్ ఒక అసామాన్యుడని రాజనీతిజ్ఞలే ఒప్పుకుంటున్న సదర్భం. ఆ పేరు ఒక విప్లవం.. సామాన్యుడిగా వచ్చి రాజకీయ చరిత్రలో, ఒక నవశకానికి ఆధ్యుడిగా వెలుగొంది అనన్య సామా న్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న దురంధురుడిగా కేసీఆర్‌కు సుస్థిర స్థానం ఉన్నది. గొప్ప నాయకుడిగా, ఉద్యమ కారుడిగా, ప్రజల బాధలు తెలిసిన మానవతావాదిగా, ప్రజా కాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించగలిగే రాజనీతిజ్ఞు డిగా, పరిపాలనా దక్షుడిగా కేసీఆర్‌కు ఒక నవ చరిత్రకు బాటలు వేశారు. ఇదే ఇప్పుడు పదేళ్ల తెలంగాణ ప్రగతికి సాక్ష్యంగా నిలు స్తోంది. దేశంలో ఎక్కడాలేని పథకాలే కాదు, ఎవరూ అమలు చేయని సంక్షేమ పథకాలు, వ్యయాలు, ఆంక్షల అధిగమనం దిశగా తెలంగాణ సాధించిన విజయాల్లో సీఎం కేసీఆర్ పాత్ర లేకుండా ఏదీ సాకారం కాలేదు.
ప్రజల నాడి పట్టుకోవడంలో కేసీఆర్‌కు మించిన శక్తి, వ్యక్తి, ప్రభంజనం దేశ రాజకీయాల్లో మరెవరూ లేదన్నది వాస్తవమని రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పే మాట. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అంకురార్పణ వరకు ఆయనదో ప్రత్యేక శైలి. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను తట్టు కొని నిల్చి అవమానాలు భరించి, అవకాశాలు రాలేదని కుంగి పోకుండా మొక్కవోని ధైర్యంతో రాజకీయాల్లో నవ చరిత్రకు జీవం పోశారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్దాలుగా మిగిలిపోయిన స్వప్నమని, అది సాధ్యం కాదని ఎన్నో పార్టీలు ఎద్దేవా చేసినా ఏండ్లు గడుచినా గమ్యం చేరని స్వరాష్ట్ర పోరాటాన్ని, లక్ష్యాన్ని సుసాధ్యం చేయడమే కాదు… కరెంటు కోతలతో రోడ్డున పడు తుందని చేసిన శాపనార్థాలను పక్కకు నెట్టి సబ్బండ వర్గాలను సమ్మిళితం చేసి అభివృద్ధి అంటే ఇదే అని చేసి చూపిన ధీశాలి ఆయన. సమైక్య పాలనలో అనాధగా మారిన తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు అమ్మ ప్రేమను అందించి ఉమ్మడి పాలనలో ఉనికిని గుర్తించని తెలంగాణకు స్పష్టమైన రూపురేఖ లనిచ్చి జనం మనసులో సముచిత స్థానం కల్పించిన ఖ్యాతి కేసీఆర్‌కే దక్కుతుందని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతు న్నారు. ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన ఉద్యమం వెనుక ఒక సామాన్య నేత అంచెలంచెలుగా ఎదిగి
సమాజాన్ని, దేశాన్ని ఆలోచించేలా, శాసించే స్థాయికి చేరడం మాములు విషయం కాదు.
ఇదో అద్బుతం. అమోఘం.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందని పలు సందర్భాల్లో రుజువైంది. తెలంగాణలో పురుడు పోసుకున్న అనేక ప్రభుత్వ, ప్రజా సంక్షేమ పథకాలు, వినూత్న ఆలోచనలు దేశం యావత్తూ అన్ని రాష్ట్రాలకూ ఆచరణీయంగా, అనుసరణీయంగా నిల్చాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, భూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర కుటుంబ సర్వే, గొర్రెల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పంపిణీ, రెండు పడక గదుల ఇండ్లు వంటి అనేకానేక పథకాలు దేశానికే ఆలోచనలు రేకెత్తించాయి. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పథకాల రూపకల్పనే కాదు, వాటి అమలులో తీసుకుంటున్న శ్రద్ధ అనేక రాష్ట్రాలు, కేంద్రం ప్రభుత్వం, పలు పరిశోధనా సంస్థలకు అధ్యయనాలుగా మారిన సందర్భాలూ తటస్థించాయి.
విధాన నిర్ణయాల అమలుకు, రూపకల్పనకు విశ్వసనీయ సమాచారం కరువవడంతో నిజానిజాల నిర్ధారణకు ఒకే రోజున 4లక్షల మందికి పైగా ఉద్యోగులను రాష్ట్రంలోని ఇంటింటికీ పంపి 94 సూచీల ఆధారంగా గణాంకాలను సేకరించిన తీరు చారిత్రాత్మకంగా నిల్చింది. భారత దేశంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమం ఎప్పుడూ జరగలేదని పేర్కొంటూ సమగ్ర కుటుంబ సర్వేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయడం, అధికారిక గుర్తింపు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా పోయిన తెలంగాణ ప్రజల సామాజిక, సాంస్కృతిక విశిష్టలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిన తీరు ఇతర రాష్ట్రాలు ఆశక్తితో గమనించాయి.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ మొదలు, అనేక కీలక నిర్ణయాలు తెలంగాణ భవితవ్యాన్ని పూర్తిగా మార్చివేశాయి. సేవల రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు అనేక సంస్కరణలు అందరినీ ఆలోచనలో పడవేశాయి. పారిశ్రామికీకరణకు పెద్దపీట వేసిన ప్రభుత్వం… సింగిల్‌విండోలో అనుమతులకు తీసుకొచ్చిన ఏకగవాక్ష విధానం ప్రపంచంలోనే ఉత్తమంగా నిల్చి అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిమంత్రంగా పనిచేసింది. అనేక సంస్థలు, రాష్ట్రాల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రపంచ విఖ్యాత సంస్థలు, నీతి ఆయోగ వంటి అనేకుల ప్రశంసలు అందుకుని తెలంగాణ తనదైన శైలిలో ప్రజారంజక పథకాలకు అందరికీ అధ్యయన కేంద్రంగా విలసిల్లుతోంది.