Friday, November 22, 2024

Bandi Sanjay : పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేయండి…

యార్న్ డిపోను ఏర్పాటు చేయండి
సబ్సిడీని 80 శాతానికి పెంచండి
పావులా వడ్డీకే రుణాలందించండి
కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసిన బండి సంజయ్
సానుకూలంగా స్పందించిన గిరిరాజ్ సింగ్

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. దీంతో పాటు నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో(యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని విజ్ఝప్తి చేశారు. అట్లాగే ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80శాతం మేరకు పెంచాలని కోరారు. ఈరోజు ఢిల్లీలో గిరిరాజ్ సింగ్ ను కలిసిన బండి సంజయ్ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ను ఏర్పాటు చేయడం వల్ల వేలాది మంది నేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ముఖ్యంగా యంత్రాల ఆధునీకరణతో పాటు ఉత్పాదకతను, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అట్లాగే యార్న్ డిపో ఏర్పాటు వల్ల సిరిసిల్ల నేత కార్మికులకు ముడి సరకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయన్నారు. ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చుల వల్ల ముడి సరకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 80శాతానికి పెంచడంతో పాటు పావలా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

బండి సంజయ్ విజ్ఞ‌ప్తి పట్ల జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. యార్న్ డిపో ఏర్పాటుతో పాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 80శాతం సబ్సిడీ, పావలా వడ్డీకే రుణాలు వంటి అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement