Monday, November 25, 2024

Big story : సంక్షోభంలో గ్రానైట్‌ పరిశ్రమ, చమురు ధరల పెంపు ప్రభావం.. తగ్గిన విదేశీ ఎగుమతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని గ్రానైట్‌ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకు ఇతర వ్యాపారుల మాదిరిగానే గ్రానైట్‌ పరిశ్రమ కూడా దెబ్బతిన్నది. కానీ, కరోనా ప్రభావం తగ్గి పరిశ్రమలు కోలుకుంటున్న దశలో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, చమురు ధరులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ తదితర అంశాలు ఈ రంగాన్ని మరింత దెబ్బతీశాయి. దేశీయంగాను, అంతర్జాతీయంగాను వ్యాపారం లేక పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. తెలంగాణలో గ్రానైట్‌ రంగం గణనీయంగా విస్తరించింది. రాష్ట్రంలో దాదాపుగా వెయ్యి వరకు గ్రానైట్‌ క్వారీలున్నాయి. మూడు వేల వరకు స్లాబ్‌, టైల్స్‌ పరిశ్రమలుంటాయి. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ పరిశ్రమలున్నాయి. వీటి ద్వారా ఏడాదికి సుమారు రూ. 3 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతుంటాయి.

కాగా, తెలంగాణలో పలు రంగుల్లో దొరికే గ్రానైట్‌కు విదేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. రాష్ట్రం నుంచి చైనా, రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా, కెనడా, యూకే తదితర దేశాలకు ముడిసరుకు రూపంలో పెద్ద బండరాళ్ల తో పాటు గ్రానైట్‌ టైల్స్‌, స్లాబ్స్‌ ఎగుమతి అవుతుంటాయి. అయితే, కొంత కాలంగా చైనాకు మాత్రమే ముడి సరుకు వెళ్లుతోది. మిగతా దేశాలకు జరిగే ఎగుమతులు నిలిచిపోయాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పలు దేశాల్లో నాటో విధించిన ఆంక్షలు ఇందుక కారణమని గ్రానైట్‌ వ్యాపారులు అంటున్నారు. వీటికి తోడు పెరిగిన ఇంధన ధరలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. గతంలో 30 టన్నుల బరువు ఉన్న గ్రానైట్‌ టైల్స్‌ కంటెయినర్‌ను ఓడలో ఎగుమతి చేసేందుకు కనీసం 1500 డాలర్లు వసూలు చేసే వారు. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రస్తుతం 2,800 డాలర్లకు చేరింది. రవాణా చార్జీల భారం పెరగడంతో విదేశీ వ్యాపారులు భారత్‌ నుంచి గ్రానైట్‌ను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

మరో పక్క సిమెంట్‌, ఇనుము ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో దేశీయంగా గృహ అవసరాలకు గ్రానైట్‌ వాడే వారి సంఖ్య కూడా తగ్గిందని గ్రానైట్‌ వ్యాపారులు చెబుతున్నారు. వ్యయాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులు గ్రానైట్‌కు బదులు సిరామిక్స్‌ టైల్స్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలు మూతపడుతాయని గ్రానైట్‌ రంగానికి వ్యాపారులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 335 స్లాబ్‌, 80 టైల్స్‌ పరిశ్రమలున్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ. వెయ్యి నుంచి రూ. 1200 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. పన్నులు, మైనింగ్‌ రాయల్టిdలు తదితర రూపాల్లో వీటి ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది. అయితే వ్యాపారం లేక ఆర్థిక భారం మోయలేక ఇందులో చాల పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. ఇక మిగిలిన పరిశ్రమల్లో ముడి సరుకుతో పాటు ఫినిషింగ్‌ టైల్స్‌ నిల్వలు పేరుకుపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement