Friday, November 22, 2024

TS: అవ్వా, తాతా బాగున్నారా.. హోమ్ ఓటింగ్ లో క‌లెక్ట‌ర్ ఆత్మీయ ప‌ల‌క‌రింపు

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : నమస్కారం..అవ్వా తాతా బాగున్నారా.. అవ్వ‌కు సరిగా కండ్లు కనిపించడం లేదు.. కదా ఎలా పనులు చేసుకుంటున్నారు.. పిల్లలు ఎందరూ.. అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓ వృద్ధ దంపతులను ఆత్మీయంగా పలకరించారు.. జిల్లా కలెక్టరే స్వయంగా ఇంటికి వచ్చి ఆత్మీయంగా పలకరించడంతో వారు చాలా ఆనంద పడ్డారు.. ఈ ఘటన హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో శనివారం జరిగింది. జూపాక గ్రామంలో సట్ల కనకలక్ష్మి ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ మేరకు సిబ్బంది ఏర్పాట్లు చేపట్టారు.

ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. కనకలక్ష్మి, వారి భర్తతోనూ మాట్లాడారు. ఎంత మంది పిల్లలు.. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తమకు ఎలాంటి వ్యవసాయం లేదని, దేవుడి దయతో బతుకుతున్నామని వృద్ధ దంపతులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు హోమ్ ఓటింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన వృద్ధులు 183 మంది ఉన్నారని, శుక్రవారం 91 మంది హోమ్ ఓటింగ్ ను వినియోగించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో రమేష్ బాబు, తహసిల్దార్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement