జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో గురువారం స్వాతంత్ర్య దినోత్స వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పుష్ఫాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు.
అనంతరం టీజీఎస్‌ఆర్టీసీని ఆదరిస్తోన్న ప్రజలకు, సంస్థ అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ఆర్టీసీ సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 77కోట్ల మందికి పైగా మహిళలను సిబ్బంది సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారని తెలిపారు.
పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం ప్లాన్ చేస్తోందన్నారు. ప్రజలకు పర్యావరణహితమైన ప్రయాణ అనుభవం కలిగించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలకు సంస్థ వాటిని నడిపేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.