Monday, October 21, 2024

TG | పోలీసు అమరవీరుల కుటుంబాల‌కు అండ‌గా ప్ర‌భుత్వం : రేవంత్

పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరులకు సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గోషామహల్ పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులని, కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో పోలీసులు ముందుంటారని, వారి సేవలు మరువలేనివని కొనియాడారు. కేఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఉమేష్ చంద్ర వంటి అధికారుల ఎందరో త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో శాంతిభద్రతలే కీలకమని, అలాంటి అతి ముఖ్యమైన శాంతిభద్రతలను పోలీసు వ్యవస్థ కాపాడుతోందని అభినందించారు. సైబర్ క్రైం ఛేదనలో తెలంగాణ విధానాన్ని కేంద్రం కూడా మెచ్చుకుందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో క్రైం రేటును నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోందని, గంజాయి, డ్రగ్స్ కట్టడికి టీజీ న్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం పోలీసులకు కీలక సూచనలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని, పండుగల నిర్వహణలో శాంతిభద్రతలను కాపాడడంలో అలసత్వం వహించవద్దని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement