Friday, November 22, 2024

HYD: బాధిత మహిళకు ప్రభుత్వం రూ.5లక్షల సాయమందించాలి… వీహెచ్

కర్మన్ ఘాట్, ఆగస్టు 19(ప్రభ న్యూస్) : బాధిత మహిళకు ప్రభుత్వం రూ.5లక్షల తక్షణ సాయమందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. చంపపేట్ డివిజన్ పరిధిలోని జీవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను శనివారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… బయట ఫ్రెండ్లీ పోలీస్, లోపట లాఠీ పోలీసులుగా వ్యవహరిస్తున్నారని హనుమంతరావు విమర్శించారు. ఎల్బీనగర్ లో గిరిజన మహిళ వడ్త్యా లక్ష్మి తన ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం చూస్తుండగా పోలీసులు అతి దారుణంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

వెంటనే గిరిజన మహిళలపై దాడి చేసిన పోలీసులపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని, ఆ మహిళ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు తక్షణ సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. గంట సేపట్లో పోలీసులు ఐదు లక్షలు సహాయం అందించని పక్షాన రోడ్డుపై బైఠాయిస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో కలిసి నాలుగు లక్షల రూపాయలు బాధిత మహిళ కుమార్తె వివాహానికి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. 50 వేల రూపాయలను తాను సొంతంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పోలీసుల అండతో పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గం పడమటిపల్లి తండాకు చెందిన వి లక్ష్మి కుటుంబం గత పది సంవత్సరాలుగా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ లో నివాసం ఉంటుందని, ఈనెల 30వ తేదీ తన కూతురు వివాహం కోసం ఎల్బీనగర్ లోని తన అన్న కొడుకు దగ్గర అప్పుగా మూడు లక్షల రూపాయలు తీసుకొని రాత్రి ఇంటికి వెళ్లేందుకు ఎల్బీనగర్ చౌరస్తాలో ఆటో కోసం చూస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు మాధవరెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement