Thursday, November 21, 2024

MBNR: ప్రభుత్వం అన్నీ ఇచ్చింది… మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో లబ్ధిదారురాలు తిరుపతమ్మ

మహబూబ్ నగర్, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్): మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో ఇంటింటికి వెళ్లి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాలనీలోని ఓ ఇంటికి వెళ్లగా… అక్కడ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పాలకొండకు చెందిన తిరుపతమ్మ ఇంటికి వెళ్లగా ఆమె కట్టెల పొయ్యిపై వేడివేడిగా జొన్న రొట్టెలు చేస్తూ కనిపించింది. అయ్యో తిరుపతమ్మ గ్యాస్ ధర ఎక్కువైందని కట్టెల పొయ్యి మీద చేస్తున్నావా… మోడీ పెంచిన గ్యాస్ ధరను మేం భారం భరించి మీకు జనవరి నుంచి రూ.400 చేస్తున్నామని ఇక త్వరలోనే మీకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు.

అనంతరం మంత్రి కొద్దిసేపు రొట్టెలను పెనంపై కాల్చి సాయం చేశారు. ఈ సందర్భంగా పొద్దున్నే ఇంటికి వచ్చిన మంత్రికి తిరుపతమ్మ వేడివేడి రొట్టెలు అందించగా.. రొట్టె తింటూ మంత్రి ఆమెతో ముచ్చటించారు. తాము తెలంగాణ ప్రభుత్వం ద్వారా అనేక పథకాలను లబ్ధి పొందామని తిరుపతమ్మ మంత్రికి తెలిపింది. కచ్చితంగా తాము కారు గుర్తుకే ఓటేస్తామని పేర్కొంది. ఒక్క తమ ఇంటికే రైతుబంధు, రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ వస్తున్నదని తెలిపింది. 24 గంటల ఉచిత కరెంటు వల్ల సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నామని వివరించింది.

2014కు ముందు ట్యాంకర్ తో నీళ్ళు వచ్చేవని, తాగునీళ్ల కోసం గొడవపడే పరిస్థితి ఉండేదని, బలమున్నోళ్లకే నీళ్లు దొరికేవని వాపోయింది. ఇప్పుడు ఆనాటి కష్టాలన్నీ సమిసిపోయాయని, ఇంటికే నేరుగా నల్లా ద్వారా మంచినీళ్లు వస్తున్నాయని ఎంతో సంతోషంగా జీవిస్తున్నామని పేర్కొంది. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తాము అండగా ఉంటామని తెలిపింది. భవిష్యత్తులోనూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొంటూ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక కౌన్సిలర్ నరేందర్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement