Wednesday, November 20, 2024

పంటల వైవిద్యీకరణపై ప్రభుత్వం దృష్టి.. మ‌హారాష్ట్ర‌లో సాగుపై అధ్య‌య‌నం: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పంటల వైవిద్యీకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. పంటల మార్పిడి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణకు మహారాష్ట్రలో మాదిరిగా వసతులు, పరిశోధన శాలలు ఎంతో అవసరమన్నారు. రైతాంగాన్ని ఇతర పంటల వైపు మళ్ళించే క్రమంలో ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న పంటల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతత్వంలోని ఎమ్మెల్యేలు, ఉద్యాన శాఖ అధికారుల బృందం జల్గావ్‌ సమీపంలోని జైన్‌హిల్స్‌లో ఉద్యాన సాగు, ప్రపంచంలోని అతిపెద్ద మామిడి ప్రొసెసింగ్‌ ప్లాంట్‌, టిష్యూ కల్చర్‌ మొక్కల తయారీ, మైక్రో ఇరిగేషన్‌, డ్రిప్‌ తయారీ యానిట్‌, సోలార్‌ పంపుసెట్ల తయారీ కేంద్రాలను పరిశీలించారు. అలాగే టిష్యూ కల్చర్‌ ద్వారా అక్కడ అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్‌ సాగు చేస్తున్న మామిడి, జామ జైన్‌ స్వీట్‌ ఆరంజ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా అల్లం, ఆలుగడ్డ, టమాటో పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 544 మిల్లి మీటర్ల అతి తక్కువ వర్షపాతం ఉన్న జల్గావ్‌లో నీటి వినియోగం తీరు రైతాంగానికి ఆదర్శమన్నారు.

900 మిల్లి మీటర్లు వర్షం పడినా తెలంగాణలో కరువుగా పరిగణిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేవలం మూడేళ్ళలో 600 మీటర్ల ఎత్తుకు నీటినిఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం నీటితో ఉత్తర తెలంగాణ, నల్గొండ సస్యశ్యామలం అయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కాబోతున్నదని చెప్పారు. మహారాష్ట్రలోని జాల్నా, జల్గావ్‌ ఇన్ని రోజులు తెలంగాణ ఎదుర్కొన్న సమస్యనే ఎదుర్కొందన్నారు. అయితే ఎత్తయిన ఈ ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతులు కురిసిన కొద్దిపాటి వర్షం నీళ్ళతోనే లాభదాయక పంటలు పండించుకుంటున్నారని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున ఫాం పాండ్‌లు నిర్మించుకుని వాటిలో ఒడిసిపట్టుకున్న నీటితోనే పంటలు పండించుకుంటున్నారని ఆయన చెప్పారు. జల్గావ్‌ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద టిష్యూకల్చర్‌ ల్యాబ్‌, మామిడి ప్రొసెసింగ్‌ ప్లాంట్‌ ఉండటం దేశానికే గర్వకారణమన్నారు. మొక్క పుట్టినప్పుడే దానికి ఎలాంటి రోగాలు లేకుండా తీసుకొస్తున్నారని, అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థ కలిగి ఉండటం అభినందనీయమన్నారు. ఇంత పెద్ద టిష్యూకల్చర్‌ ల్యాబ్‌ ఉన్నప్పటికీ డిమాండ్‌కు తగిన మొక్కలు అందించలేకపోతున్నామని ఆయన తెలిపారు. జల్గావ్‌ ప్రాంత అభ్యున్నతికి జైన్‌ వంటి సంస్థ చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మొక్కలు ఉద్యానవన పంటల వైపు మళ్ళుతున్న రైతాంగానికి ఎంతో ఉపయోగకరమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement