నిజామాబాద్, ఫిబ్రవరి 25 : ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగు బంధం ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ అనుబంధాన్నిఎన్నటికీ విడదీయలేరని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మైదానంలో మూడు రోజుల పాటు కొనసాగిన టీఎన్జీవో 34 వ జిల్లా స్థాయి అంతర్ శాఖల క్రీడా పోటీలు శనివారం సాయంత్రం నాటితో ముగిశాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్రీడా పతాకాన్ని అవనతం చేసి పోటీలు ముగిసినట్టు ప్రకటించారు. వివిధ క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన జట్లను అభినందిస్తూ మెమొంటోలు అందజేశారు.
తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం పట్ల టీఎన్జీవో జిల్లా కార్యవర్గానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు వేరు, తాము వేరు అనే భావన తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని, ఇకముందు కూడా అలాంటి ఆలోచన రాదని అన్నారు. ఉద్యోగులకు మంచి చేస్తే, దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని బలంగా విశ్వసించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు.
ఇదంతా ఉద్యోగుల భాగస్వామ్యంతోనే సాధ్యమయ్యిందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడుతున్న ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి సానుకూల దృక్పధంతో వారికి అనుకూల నిర్ణయాలు చేపడతారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని భరోసా కల్పించారు. త్వరలోనే పీ.ఆర్.సి ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం బడ్జెట్లో ఈ.హెచ్.ఎస్ కు రూ.350 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. కాగా, క్రీడలకు ప్రత్యామ్నాయం వేరే ఏదీ లేదని, కులమతాలు, పేద-ధనిక తేడాలు లేకుండా స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, మనలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెస్తాయని అన్నారు. జిల్లా స్థాయి అంతర శాఖల క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం పట్ల టీఎన్జీవో బాధ్యులను అభినందించారు. ఉద్యోగుల సౌకర్యార్ధం జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన కల్యాణ మండపం స్థలానికి అనుమతులు మంజూరు చేయిస్తానని, భవన నిర్మాణానికి కూడా తనవంతు తోడ్పాటును అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు.