Friday, November 22, 2024

అభివృద్ధి అంటే కుటుంబం కోస‌మా – కెసిఆర్ పై గ‌వ‌ర్న‌ర్ గ‌రం గ‌రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ను ఆహ్వానించక పోవడం ఇందుకు కారణమైంది.రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం ఇవ్వడం లేదని రాజ్‌భవన్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఇదే అంశంపై గవర్నర్‌, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జీ-20 సమావేశాల్లో భాగంగా బుధవారం సీ-20 సమాజ్‌శాల ఏర్పాటు- చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మరోమారు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.కొంత మంది మాట్లాడతారు కానీ పని చేయరని తనను సచివాలయ ప్రారంభోత్స వానికి పిలవలేదని, ప్రగతిభవన్‌.. రాజ్‌భవన్‌ దూరంగా ఉంటు-న్నాయని పేర్కొన్నారు

అభివృద్ధి అంటే ఒకే కుటు-ంబం కోసం కాదన్నారు. తాను ప్రజలకు సేవ చేయడానికి తెలంగాణకు వచ్చానని రాజకీయాలు కోసం కాదని ఆమె స్పష్టం చేశారు కొవిడ్‌ సమయంలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ అందించామని పీకొన్నారు.స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఇప్పుడు ప్రధాని మోదీ నిజం చేస్తున్నారని సేవ చేయడం అనేది సంస్కృతిలోనూ, రక్తంలోనే ఉందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.మనం ఇతర దేశాల అధినేతలను కలవవచ్చు. కానీ ఈ రాష్ట్ర అధినేతను మాత్రం కలవలేమని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఇది చాలా దురదృష్టకరమని రాజకీయాలు మాట్లాడటం సరికాదు కానీ… దురదృష్టకరమేంటంటే దేశాలు సైతం కలుస్తున్నాయి కానీ.. రాజ్‌భవన్‌- ప్రగతిభవన్‌ మాత్రం కలవడం లేదని అతిపెద్ద సచివాలయం ప్రారంభించినా… రాష్ట్ర ప్రథమ పౌరురాలికి ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా వ్యక్తిగతం కాదు. ముఖ్యమంత్రి, గవర్నర్‌, మంత్రివర్గ సభ్యులైనా… వారి వ్యక్తిగతమైన విషయం కాదని రాష్ట్రం, దేశానికి చెందినవారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం ఎప్పుడూ ప్రొటోకాల్‌ పాటించలేదని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి తనపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోందని తమిళిసై విమర్శించారు.ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఏప్రిల్‌ 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు గవర్నర్‌ను, ప్రతిపక్షాల నేతలను, పాత్రికేయులను ఆహ్వానించాల్సి ఉండగా.. ప్రభుత్వం కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం చేస్తున్నారు
ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమాలకు తనను దూరం చేస్తున్నారని అనేక సందర్భాల్లో తమిళిసై ఆరోపించారు. ఇటీ-వల హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ 125 విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనకు ఎలాంటి పిలుపు అందలేదని అన్నారు. ఆహ్వానం రానందున.. రాజ్‌ భవన్‌లోనే నివాళులు అర్పించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజకీయ నాయకురాలుగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

- Advertisement -

ఈ వివాదం ఇప్పటిది కాదు
గవర్నర్‌, ప్రభుత్వానికి మధ్య నడుస్తోన్న వివాదం ఇప్పటిది కాదు. గత రెండేళ్లుగా ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య దూరం పెరిగింది. ఇది కాస్త సీఎం కేసీఆర్‌ వర్సెస్‌ గవర్నర్‌ తమిళిసై అనే విధంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలకు కూడా గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదని ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. 10 రోజులు ముందే ఆమెకు లేఖ పంపించామని అయినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. చివరికి ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమై బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement