హైదరాబాద్ – తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోందని గవర్నర్ తమిళిసై అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. అంతకుముందు గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, ” ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలులోకి వచ్చిన విషయం మీకు తెలుసు. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పధకంలో ఇప్పటి వరకు 11 కోట్ల పైబడి మహిళా సోదరీ మణులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎంతో సంతోషకరం. మిగిలిన గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి ప్రజల మొఖాలలో ఆనందం చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల నిర్వాకంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారినా, వ్యవస్థలు గాడి తప్పినా అన్నింటినీ సంస్కరించకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రజా సంక్షేమమే. . ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత.. అని పేర్కొన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రూ. 2,00,000 రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఉద్యోగాల భర్తీపై యువత ఎలాంటి అపోహలకు గురికావోద్దని సూచించారు..
అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన సాగుతోంది. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఉద్యోగాల భర్తీపై ఎలాంటి అపోహలకూ యువత లోను కావొద్దు. దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలు కుదుర్చుకున్న సీఎంను, ఆయన బృందాన్ని అభినందిస్తున్నానని తెలిపారు..