నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, పస్త్రా గ్రామం, అభ్యుదయ కాలనీలోని మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.45.60 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. పాఠశాలలోని అభివృద్ధి పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం రూ.38లక్షల ఐటీడీఏ నిధులతో బాలింతలకు మూడు నెలల వరకు అందించే పౌష్టికాహారాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం మన ఊరు – మన బడి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పేదింటి బిడ్డ నాణ్యమైన విద్యను అభ్యసించడానికి పాఠశాలల్లో అన్ని విధాలా వసతులను కల్పించేందుకు మన ఊరు మనబడి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు.
మన ఊరు-మనబడి కింద ఎంపికైన పాఠశాలల్లో మొదటి ప్రాధాన్యతగా తాగునీరు, విద్యుత్, ల్యాబ్స్, ప్రహరీ నిర్మాణం, తరగతుల మరమ్మతులు, మూత్రశాలలు మెరుగుపరుచుకున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లోనూ 12 రకాల వసతులతో తీర్చిదిద్దుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం కోసం మొత్తం రూ.7,289.54 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మొత్తం మూడు విడతల్లో 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. తొలి దశలో 9,123 పాఠశాలల్లో జూన్ కల్లా పనులను పూర్తి చేస్తామన్నారు. రెండు, మూడు విడతల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణంపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు స్పెషల్ స్నాక్స్ అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ములుగు జిల్లా అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ జిల్లాలో రూ.53 లక్షల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందించడం జరిగిందన్నారు. ఈ డబ్బులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోవడం దురదృష్టకరమన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, రైతులను రాజు, వ్యవసాయాన్ని పండగ చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. నష్టాన్ని అంచనా వేసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీలకు రూ.250 కోట్లతో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయనున్నారన్నారు. గోదావరి కరకట్ట పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్, శాసనసభ్యులు ధనసరి అనసూయ సీతక్క, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవిందు నాయక్, వైస్ చైర్మన్ నాగజ్యోతి, జడ్పీటీసీ నాగభవాని, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్, అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.